
ప్రముఖ కవి, రచయిత, భౌతికవాది డాక్టర్ మలయశ్రీ బ్రెయిన్‌స్ట్రోక్‌తో కరీంనగర్లో శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతితో యావత్ తెలుగు సమాజం ఒక గొప్ప సాహితీవేత్తను, సృజనశీలిని, చరిత్రకారుడిని, అంతకు మించి గొప్ప పరిశోధకుడిని కోల్పోయినట్లయింది. మలయశ్రీ తనను తాను ‘మనిషి కవి’ గా ప్రకటించుకున్నారు. ‘వస్తుతః ఆయన హేతువాది..బౌద్ధ తాత్త్వికానుయాయి.. అతీత శక్తులను విశ్వసించని తార్కికుడు.. వెరసి అక్షరాలా అచ్చమైన మానవతావాది..’ అంటారు సినారె.
మలయశ్రీ సృజనకు అంచనా వేయలేనన్ని అంచులున్నాయంటారాయన. అందుకు తగినట్లే.. కవిత్వం, కథ, నాటకం, నవల, మినీ కవిత, బాల గీతావళి, అనువాదం, చరిత్ర, విమర్శ, వ్యాసరచన.. ఇలా విభిన్న ప్రక్రియల్లో మలయశ్రీ సాహితీసృజన చేశారు. ఆయన కలం నుంచి ఇప్పటివరకు 26 పద్య, గేయ కావ్యాలు, 12 నవలలు, 6 సీరియళ్లు, 20 బాల సాహిత్య పుస్తకాలు, 20 వయోజన విద్య పుస్తకాలు, 5 నాటకాలు, ఇంకా పలు చరిత్ర పరిశోధన గ్రంథాలు, అనువాదాలు వెలువడ్డాయి. మొత్తం 150 దాకా పుస్తకాలతో రాశినూ , వాసిలోనూ మెప్పించడం మలయశ్రీ కే చెల్లింది.
1940లో కరీంనగర్ జిల్లా చెంజెర్లలో జన్మించిన మలయశ్రీ అసలు పేరు సంగని మల్లయ్య. ఆయన భార్య పేరు భారతీదేవి. కొంతకాలం కిందే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు పిల్లలు. తెలుగు ఉపాధ్యాయుడిగా విద్యారంగంలో విశేష సేవలందించిన మలయశ్రీ, లెక్చరర్‌గా పదవీ విరమణ పొందాక తన జీవితాన్ని పూర్తిగా సాహితీసేవకే అంకితం చేశారు. 1968లో ‘కావ్యసుందరి’ మొదలు ఆయన కలం నుంచి అనేక పుస్తకాలు వెల్లువెత్తాయి. 1997లో వచ్చిన మలయశ్రీ వీహెచ్‌డీ గ్రంథం ‘కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్ర..’ పరిశోధన గ్రంథాల్లో కలికితురాయిగా నిలిచింది. 1975లో వెలువడిన ‘శాంతి పథం’ నాటకం కొంతకాలం ఇంటర్మీడియెట్పాఠ్యపుస్తకంగా ఉంది.
1982లో వచ్చిన ‘తిరుగుబాటు’ నవల (విశాలాంధ్ర), 1987లో వచ్చిన మానవగీత ,1991లో వచ్చిన ‘తెలుగులో లేఖా సాహిత్యం’ ( తెలుగు అకాడమీ), 1995లో వచ్చిన ‘కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’ (శాతవాహన, కాకతీయ విశ్వవిద్యాలయాల ఎంఏ తెలుగు పాఠ్యగ్రంథం –2014), 1989 కాకతీయ కాలంనాటి సామాజికజీవితం, 1997లో వచ్చిన వజ్రసూచి( సంస్కృతానువాదం), 2006లో వచ్చిన ‘పాల మనసులు’ (రాష్ట్ర బాల కార్మిక నిర్మూలన సంస్థ ప్రచురణ), 1998లో వచ్చిన నిజమైన బౌద్ధం (వ్యాసాలు), 2003 లో వచ్చిన ప్రజాకవి వేమన (నాటకం), 2010లో వచ్చిన తెలంగాణ చరిత్ర-సంస్కృతి, జన జీవనం (2010) మలయశ్రీకి గొప్ప పేరుతెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన అందించిన ‘తొలి తెలుగు చక్రవర్తులు’ అనే నాటకాలు చరిత్ర రచనలో కొత్త ఒరవడిగా చెప్పుకోవచ్చు. చరిత్రను కేవలం రాజులు, యుద్ధాలు, జయాపజయాలకే పరిమితం చేయకుండా.. ఆనాటి కాల, మాన పరిస్థితులతో కలిపి అధ్యయనం చేసే అవకాశం మనకు కల్పించారు.
తెలుగుకు ప్రాచీన హోదా మలయశ్రీ ఘనతే..
తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడంలో మలయశ్రీ పరిశోధన కీలకంగా నిలిచింది. కరీంనగర్ జిల్లా కురిక్యాల గుట్టపై కనుగొన్న జినవల్లభుని శాసనంలో ఉన్నవి తొలి తెలుగు కంద పద్యాలని ఆయన తేల్చారు. ఇందుకోసం ఆ కంద పద్యాల్లోని పద పరిణామక్రమాన్ని శోధించి క్రీ.శ. 946 లోనే తెలుగు భాషలో ఈ స్థాయి సాహిత్యం ఉన్నట్లు నిరూపించారు. మన తెలుగుకు ప్రాచీన హోదా రాకుండా ఎప్పటి నుంచో అడ్డుకుంటున్న తమిళులకు మలయశ్రీ పరిశోధన చెంపపెట్టుగా మారింది. విమర్శకులు నోళ్లు మూసుకోవడంతో కేంద్రం అనివార్యంగా తెలుగుకు ప్రాచీన హోదా కట్టబెట్టింది. బుద్ధుని సమకాలీనుడుగా భావించే బావరి ముని నివాసమున్నది గోదావరి తీరాన గల బాదనకుర్తి అని మలయశ్రీ నిరూపించారు.
కరీంనగర్జిల్లా కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని అని, ఇక్కడ సిరిముఖ, సిరిశాతవాహనల నాణేలు లభించడమే ఇందుకు కారణమని గట్టిగా వాదించిన వారిలో మలయశ్రీ ఒకరు. అటు సాహిత్యం ద్వారా తెలంగాణ సామాజిక చరిత్రను మలయశ్రీ సాధికారంగా చెప్పారు. ‘తెలుంగు గణం’ నుంచి తెలంగాణ పుడ్తే .. ఆంధ్ర అనేది ‘జాతి’ పదమని మలయశ్రీ అభిప్రాయం. మేఘసందేశంలో కాలిదాసు పేర్కొన్న యక్షుడు నివసించిన రామగిరి, ప్రస్తుత పెద్దపల్లి, మంథని మార్గంలో ఉన్న రామగిరే అని మలయశ్రీ అంచనా. అష్టదిగ్గజాలకు పూర్వీకుడైన ‘చరిగొండ ధర్మన’ కరీంనగర్‌కు చెందిన ధర్మపురివాసి అని మలయశ్రీ రుజువు చేశారు.
నారాయణ శతకకర్త వెలిగందుల నారయ అని నిరూపించిందీ మలయశ్రీనే. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడిని ఎదురించిన నాగమ్మ స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని ఆర్వెల్లి అని అప్పటికే ప్రచారంలో ఉండగా, అందుకు మలయశ్రీ పలు రుజువులు ఇచ్చారు. ఆమె నాగమ్మ కాదని, బల్మూరి కొండన్న కథలోని నాయకురాలు అని కొందరు వక్రీకరించే ప్రయత్నం చేయగా, మానాల బల్మూరి వెలమల నుంచి ఇప్పటికీ ఆర్వెల్లి ఉత్సవాలకు సారె వస్తుండడాన్ని బట్టి ఈమె నాగమ్మ అని కుండబద్దలు కొట్టారు. బతుకమ్మ పుట్టుక గురించి, సమ్మక్క పుట్టినూరి గురించి మలయశ్రీ చేసిన సూత్రీకరణలు మిగిలిన రచయితలకు భిన్నంగా, వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి.
బౌద్ధ, జైన ఆనవాళ్లపై పరిశోధన..
తెలంగాణలోని బౌద్ధ, జైన ఆనవాళ్లపై మలయశ్రీ విశేష కృషి చేశారు. బావరి శిష్యులు అశ్మక దేశ గోదావరి తీర వాసులు.(బుద్ధునితో సంభాషణ–సుత్తనిపాత -పారాయణ వగ్గ ), మగధ రాజు బింబిసారుని సమక్షంలో ఆంధ్రనటుల మహాబోధి నాటక ప్రదర్శన( లలిత విస్తర గాధ), బుద్ధుని శిష్యుడు మహాకాత్యాయనుడు అశ్మక రాజుకు బౌద్ధ ధర్మదీక్ష ఇవ్వడం(విమానవత్తు), అశ్మక రాజధాని పోతలి -(బోధన్), బుద్ధుని శిష్యుడు కొండన(కొండన్న తెలుగు వ్యక్తి).. ఇలాంటి ఎన్నో వివరణలు మలయశ్రీ మనకు అందించివెళ్లారు.
జైన, జైనత్(జైనథ్), జనగాం(జైన గ్రామం), వర్ధన్న పేట(వర్ధమాన మహావీరుడు) పేరిట వెలిసిన గ్రామాలు. పశ్చిమాభిముఖంగా ఉన్న వేములవాడలోని బద్ధి పోచమ్మ, హనుమకొండలోని సిద్ధేశ్వర, భద్రకాళి, పద్మాక్షి , జిన వల్లభుని కురిక్యాల శాసనం లాంటివన్నీ జైన ఆనవాళ్లుగా మలయశ్రీ పేర్కొంటారు.
అనువాదంలో మేటి..
అనువాద రంగంలో మలయశ్రీ ఆరితేరిన రచయిత. ఆయనకు తన మాతృభాష తెలుగుతోపాటు సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ , తమిళం, కన్నడం, మరాఠీలో మంచి ప్రావీణ్యం ఉంది. మలయశ్రీ సంస్కృతంలో కవిత్వం రాయడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అశ్వఘోషుని ‘వజ్ర సూచి’ని మలయశ్రీ తెలుగులోకి అనువదించారు. కాళిదాసు మేఘసందేశం కావ్యాన్ని ‘యక్ష సందేశం’ పేరుతో తెనుగీకరించారు. బౌద్ధుల ధర్మపదమును తెలుగులోకి పద్యనువాదం చేశారు.
సంస్కృతంలో ‘మానవగీత’ రచించారు. మధ్యయుగాల్లో సంస్కృత భాషను బ్రాహ్మణ మతవాదులు తమ వర్గ, వర్ణ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఉపయోగించుకున్నారు. కానీ సంస్కృతంలో మతసాహిత్యంతో పాటు లౌకిక సాహిత్యం ఉన్నందునే మలయశ్రీ సంస్కృత భాష, సాహిత్యాలను అధ్యయనం చేసి అదే భాషలో హేతువాద, మానవవాద కవిత్వాన్ని రచించారు.
కరుడుగట్టిన భౌతికవాది..
మలయశ్రీ ఒక కరడుగట్టిన భౌతికవాది. ఆదిమ మతాల వల్లే ఆధునికులు సతమతమవుతున్నారనేది ఆయన నిశ్చితాభిప్రాయం. మూఢనమ్మకాలను వీడాలంటే ముందు దేవుడిని వీడాలంటారాయన. ఎందుకంటే ‘మూఢ నమ్మకాల ముత్తాత పేరే దేవుడు’ అని నిర్మొహమాటంగా చెప్తారు. నాస్తికత్వం, ఆస్తికత్వం గురించి చెప్తూ ఈ రెంటి మధ్య ఒప్పుకూ తప్పుకూ, సత్యానికి అసత్యానికి, మానవత్వానికి, పశుత్వానికి, నారికతకూ, అనాగరికతకూ నడుమ ఉన్నంత తేడా ఉందంటారు. ఆత్మ అబద్ధమని, స్వర్గ, నరకాలు ఊహాజనితాలంటూ కొట్టిపారేసేవారు.
ఆర్థిక అసమానతలకు, సామాజిక అంతరాలకు కారణమైన మతాన్ని విడిచే పెడ్తే తప్ప మానవత్వం సాధ్యం కాదంటారు. ఈ క్రమంలోనే మనువాదాన్ని, వైదిక క్రతువులను ఆయన వదిలించుకున్నారు. తన కులాన్ని, మతాన్ని విడిచిపెట్టారు. తగదని వారించిన వారినీ పక్కనపెట్టేశారు. ఒక భౌతికవాదిగా తాను నమ్మిన సిద్ధాంతానికి మలయశ్రీ తుదకంటా కట్టుబడి ఉన్నారు. మాటలు, రాతల్లోనే కాదు, చేతల్లోనూ దీనిని నిరూపించారు. తన కూతురికి అన్య మతస్థునితో ఆదర్శ వివాహం జరిపించడంతోపాటు వారింట ఇప్పటివరకు జరిగిన వివాహాలన్నీ స్టేజ్ మ్యారేజీ లే కావడం విశేషం. తన తండ్రి మరణిస్తే కింద వేసి పాడె కట్టడాన్ని నిరాకరించిన వ్యక్తి మలయశ్రీ. కొన్నాళ్ల క్రితం ఆయన సహచరణి కాలం చేస్తే కర్మకాండల ఊసెత్తలేదు.
ఈ విషయంలో ప్రజల్ని చైతన్యపరిచేందుకు ‘భౌతికవాది’ పేరుతో మలయశ్రీ సామాజిక చైతన్య పత్రిక నడిపారు. ప్రగతిశీల కవులు, రచయితలను ప్రోత్సహించేందుకు తన నవ్యసాహిత్య పరిషత్సంస్థ ద్వారా ఏటా సాహితీ అవార్డులను అందిస్తూ వచ్చారు. ‘మానవత్వమే నా మతం.. మానవుడే నా దేవుడు..’ అని ఎలుగెత్తి చాటిన మనిషి కవి మలయశ్రీ.. తరతరాలకు కావాల్సినంత సాహితీ సంపదను తెలుగు పాఠకలోకానికి అందించి ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన నాతో తరుచూ చెప్పే మాట గుర్తుకొస్తుంది… సెలవిప్పటికి… స్నేహమెప్పటికీ..
తెలంగాణ మాండలికంపై మక్కువ..
‘మీది తౌరక్య ఆంధ్రం’ అంటూ వెటకారమాడిన సీమాంధ్ర పండితులకు సమాధానంగా ‘తెలంగాణదే అసలు తెలుగు’ అని మలయశ్రీ నిరూపించారు. స్థానిక-మాండలిక పదాలను వదలితే ఈ రెండు ప్రాంతాల క్రియాపదాల నడుమ చాలా తేడా ఉందన్న మలయశ్రీ, పదాల పరిణామక్రమాన్ని తన ‘తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జనజీవనం’ అనే పుస్తకంలో సోదాహరణంగా వివరించారు. నన్నయ భారతంలోని “వచ్చియున్నవాండు ఫల్గునుండు’ అనే వాక్యాన్ని తీసుకొని ఇందులోని ‘వచ్చియున్నవాండు.. వచ్చినడు.. వచ్చిండు అయ్యే.. వచ్చాడు మీదెట్లవచ్చె? ఇంక వచ్చేసినాడెట్ల వచ్చె!” అని నిలదీశారు. (వచ్చిండు: తెలంగాణ, వచ్చాడు-: కోస్తా, వచ్చేసినాడు:- సీమ) 2003 నవంబర్ 1న అమరావతిలో ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ నిర్వహించిన మాండలిక భాషా సదస్సులో -‘అరవ కన్నడ ఒరియ ఆంగ్లమ్ము కలగలిపి అందమా మీ ఆంధ్ర కులుకు? అచ్చ తెలుగుకు కొంత ఉర్దూ కలిస్తేనేనచ్చమా మా తెలుగు పలుకు! .. అంటూ మలయశ్రీ సీమాంధ్ర పండితులకు చురక అంటించారు.
మనతో మాట్లాడుతున్నట్లుగా ‘వచనం’ రాయడం మలయశ్రీ ప్రత్యేకత. మాండలికభాష అంటే మలయశ్రీకి ఎంతో ప్రేమ. కానీ మాండలికం, గ్రామ్యం వేర్వేరు అనే విషయం గుర్తుంచుకోవాలని, గ్రామ్యం అన్ని సందర్భాల్లో ప్రయోగార్హం కాదని చెప్తుంటారు. ఉదాహరణకు ‘విచిత్రం’ అనేందుకు నోరు తిరగని నిరక్షరాస్యులు ‘ఇసిత్రం’, ‘ఇచ్చెంతురం’ అంటే దానిని కవి/ రచయిత తమ మాటగా రాయవద్దని, అది ఆయా పాత్రల వరకే పరిమితం చేయాలనేది మలయశ్రీ ప్రధాన సూచన.
– చిల్ల మల్లేశం, సీనియర్ జర్నలిస్ట్
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
featureseditor@v6velugu.com