
సిద్దిపేట రూరల్, వెలుగు: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి వాటిని పట్టించుకోకుండా కేరళలో ఎన్నికల ప్రచారం చేస్తూ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు దొంతుల సురేశ్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ పాషాతో పాటు మరికొంత మంది ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి వెళ్లినట్టుగా, తెలంగాణలో ఆరు గ్యారంటీలను సరిగా అమలుచేయడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి, కేరళకు వెళ్లి హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆయన పద్ధతి ఇంట్లో ఈగల మోత కేరళలో పల్లకీ మోత అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
అమలవుతున్న పథకాలను బంద్ పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేమీ లేదని, కేసీఆర్ కిట్, మైనార్టీ బంధు, దళిత, బీసీ బంధులను ఆపేశారని విమర్శించారు. అన్నీ సిద్ధం చేసి ఇచ్చినా.. ప్రభుత్వాన్ని నడపడం కూడా రేవంత్‌కు చేతకావడం లేదన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ, వారిని కట్టుబట్టలతో నడిరోడ్డున పడేస్తున్నారని, పేదల బతుకులు కూల్చడానికే హైడ్రాను పెట్టారా ? అని ప్రశ్నించారు.
సిద్దిపేటలోని అన్ని అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని, సిద్దిపేటకు అన్యాయం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరు రాజనర్సు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, ధర్పల్లి శ్రీనివాస్, పత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.