
హైదరాబాద్: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై గందరగోళం నెలకొన్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ‘జీఎస్డీపీ’ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) ఫార్ములా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెండ్ దక్కాలంటూ ఆయన ప్రతిపాదించిన ‘50-–50 గ్రోత్ ఫార్ములా’ కొత్త చర్చకు దారితీసింది. దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి పార్లమెంటులో ప్రాతినిథ్యం కల్పించాలని రేవంత్ ప్రతిపాదించారు.
ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా దాదాపు 5 శాతంగా ఉండగా, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి దేశ ఆర్థిక రథాన్ని 53 శాతంతో ముందుకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ని ఎంపీ సీట్లు పెంచినా సరే.. ‘50–-50 గ్రోత్ ఫార్ములా’ ప్రకారం రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలనేది సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 815 కు పెంచితే, అదనంగా వచ్చే సీట్లు 272. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఇందులో 50 శాతం అంటే 136 సీట్లను కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ఏడు రాష్ట్రాలకే (దక్షిణాది + పశ్చిమ రాష్ట్రాలు) కేటాయించాలి.
ఈ 136 సీట్లను ఆయా రాష్ట్రాలకు ఎలా పంచాలి అనే చోటే ‘జీఎస్డీపీ’ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ 7 రాష్ట్రాలు ఉమ్మడిగా దేశ జీడీపీలో 53.37 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్రాతిపదికన ఈ 136 సీట్లను పంపిణీ చేస్తే, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంటులో తిరుగులేని బలం చేకూరుతుంది.