Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం : మౌనం మూడు రకాలు.. ఈ మూడింటి మధ్య ఉన్న తేడా ఏంటీ.. ఈ కాలానికి ఏది బెస్ట్ అంటే..!

Caption of Image.

మౌనం అంటే కేవలం పెదవి దాటకుండా మాటలకు అడ్డుకట్ట వేయడం కాదు. మన భావాలను, సిద్ధాంతాలను సైగలతో, రాతలతో చెప్పడమూ కాదు. నిశ్శబ్దంగా ఆలోచించడం అంతకన్నాకాదు. మౌనం అంటే అంతరింద్రియ విజృంభణను లేదా ఉద్రేకాల్ని ఆపడం. మనో, బుద్ధి, చిత్త అహాలతో కూడి అంతఃకరణాన్ని అంతరింద్రియం అంటారు. ఆలోచనలు, ఆవేదనలు, కోరికలు, కోపాలు, భయాలు, మాటల వంటివేం లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడమే మౌనం.

ఆత్మపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండటమే మౌనం. అది ఆలోచనలు లేని తపస్సు! విషయ శూన్యావస్థ. మనం అనుకునే కష్టాలు, మనం ఊహించుకునే బాధల తాలూకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఇసుమంత కూడా ‘అహం’ పుట్టని స్థితి. మౌనాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే.. అది శాశ్వతమైన సంతోషంతో నిండిన పరిపూర్ణ ఆత్మస్థితి.

మౌనం మూడు రకాలు

వాగ్మౌనం

వాక్కుని నిరోధించడమే వాగ్మౌనం. అంటే ఏమీ మాట్లాడకుండా ఉండటం అన్నమాట. దీనినే మౌనవ్రతం అంటారు. మహాత్మాగాంధీ ఈ వాగ్మౌనాన్ని సాధన చేసేవారు. ఇలాంటి మౌనం పాటించడం వల్ల కఠినంగా మాట్లాడటం, అబద్ధాలాడటం, చాడీలు చెప్పడం, పరనింద చేయడం, అసందర్భప్రేలాపనలు చేయడం వంటి వాగ్డోషాలన్ని హరిస్తాయి. లాక్ డౌన్ సమయంలో ఇలాంటి మౌనాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా తేలిక.

అక్షరమౌనం

మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించడమే అక్షరమౌనం. ఈ మౌనంలో కళ్లు, చేతులతో పాటు ఏ ఇంద్రియంతోనూ సైగలు చేయకుండా, అక్షరాలు రాయకుండా ఏకాగ్రనిష్టతో ఈ మౌనంలో మునిగిపోతారు. ఇలా ఇంద్రియ శక్తిని కోల్పోకుండా పాటించే ఈ మౌనంతో.. మనసు ధ్యానం వైపు, వైరాగ్యం వైపు మళ్లేలా చేయొచ్చు. ఇది కొంచెం కష్టమే అయినా.. ఒంటరిగా ఉన్నవాళ్లు దీన్ని ప్రాక్టీస్  చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కాష్టమౌనం

మౌనంగా ఉన్నామనసు ఇష్టమొచ్చినట్టు అటుఇటు తిరుగుతుంది. మౌనంగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలకు అడ్డుకట్ట వేయడమే ఈ కాష్టమౌనం. మనసుని నిర్మలంగా ఉంచడమే దీని ఉద్దేశం. దీన్నే మానసిక మౌనం అంటారు. ఈ మౌనంలో మనసుని దైవ చింతన లేదా ఆత్మ మీద ఫోకస్ పెడుతూ క్రమక్రమంగా పరిపూర్ణ మౌనస్థితికి తీసుకెళ్తారు. ఈ మౌనమే ఆత్మసాక్షాత్కారానికి మార్గం వేస్తుంది. 

►ALSO READ | మనిషి కవి.. మలయశ్రీ

గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది అంటారు నలభై ఏళ్లు కాష్టమౌన దీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా.

©️ VIL Media Pvt Ltd.