Reading Time: 2 minutes

ఎన్నికల్లో ఓడిన హంగేరీ ప్రధాని.. ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ!

Caption of Image.

ఇరాన్ను త్వరలోనే అంతం చేస్తామని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తనకు అత్యంత సన్నిహితుడు, చిరకాల మిత్రుడు అయిన హంగేరి దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ను 16 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఆ దేశ ప్రజలు గద్దె దించేశారు. ఆదివారం (ఏప్రిల్ 12) హంగేరి దేశ చరిత్రలోనే అద్భుతం జరిగింది. హంగేరి ప్రధానిగా ఉన్న విక్టర్ ఒర్బాన్తో విభేదించి.. కొత్తగా టిస్జా పార్టీని స్థాపించిన పీటర్ మాగ్యార్ హంగేరి దేశంలో జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు. మాగ్యార్ టిస్జా పార్టీ 199 పార్లమెంటరీ స్థానాలకు గాను 138 స్థానాలను గెలుచుకుంది. మూడింట రెండు వంతుల భారీ మెజారిటీని సాధించింది.

ఓర్బన్‌ నేతృత్వంలోని ఫిడెజ్ పార్టీకి 55 స్థానాలు మాత్రమే దక్కాయి.  95 లక్షల జనాభా ఉన్న యూరప్ దేశమైన హంగేరీలో తమ పార్టీ విజయం ఒక అద్భుతం అని ఫలితాల అనంతరం పీటర్ మాగ్యార్ హర్షం వ్యక్తం చేశారు. ఓర్బన్ తన 16 ఏళ్ల పాలనలో యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. 2018లో ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు.. ఆయనకు బాహాటంగా మద్దతు తెలిపిన తొలి యూరోపియన్ యూనియన్ దేశాధినేత ఓర్బన్ కావడం గమనార్హం. అప్పటి నుంచి.. ట్రంప్, ఓర్బన్ పలుమార్లు సమావేశమయ్యారు. ఓర్బన్ మారా-లాగోలోని ట్రంప్ నివాసానికి వెళ్లారు. వైట్ హౌస్‌లో కూడా పర్యటించారు. ట్రంప్, ఒర్బన్ పాలనా విధానాలు చాలా దగ్గరగా ఉండేవి.

►ALSO READ | ఇదేనా మీ యుద్ధ నీతి..? మహాత్మాగాంధీ ఆసుపత్రిని ధ్వంసం చేయడంపై ఇరాన్ ఫైర్.. వీడియో రిలీజ్

ట్రంప్ లానే సంచలన హామీలకు, నిర్ణయాలకు ఒర్బన్ పెట్టింది పేరు. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే జీవితాంతం ఇన్ కం ట్యాక్స్ కట్టక్కర్లేదని 2019లో ఆయన ప్రకటించిన ఎన్నికల హామీ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక.. ప్రస్తుతం ఆయన పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే.. ఒర్బన్ పాలనా వైఫల్యాల్లో సివిల్ సర్వీస్ చట్టాన్ని నిలిపివేయడం ఆయన పార్టీని దెబ్బ తీసింది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను, ముఖ్యంగా పబ్లిక్ బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ఉన్నవారిని తొలగించారు. ఈ చర్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ ఆయన ఒంటెద్దు పోకడలు ఎన్నికల్లో ఆయన పార్టీకి శాపంగా మారాయి.

©️ VIL Media Pvt Ltd.