
Flax Seeds Powder: ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవాలనుకునే వారి కోసం, సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలని చూసే వారి కోసం అవిస గింజల కారప్పొడి ఒక అద్భుతమైన వరం. ప్రస్తుతం మన జీవనశైలిలో పోషకాహార లోపం, పెరుగుతున్న బరువు పెద్ద సమస్యలుగా మారాయి. వీటన్నింటికీ ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్
అవిస గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరంలోని మెటబాలిజంను వేగవంతం చేసి కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మన వంటింట్లో ఉండే దినుసులతో ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఈ స్పెషల్ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
అవిస గింజలు (1 కప్పు)
నువ్వులు (అర కప్పు)
ధనియాలు (పావు కప్పు), కరివేపాకు (గుప్పెడు)
ఎండుమిర్చి (20-25), పప్పులు (శెనగ, మినప – తలో 2 టేబుల్ స్పూన్లు)
జీలకర్ర, మెంతులు, చింతపండు, వెల్లుల్లి (15 రెబ్బలు), ఇంగువ, ఉప్పు.
తయారీ విధానం..
అవిస గింజలను పాన్‌లో వేసి చిటపటలాడే వరకు చిన్న మంటపై నిదానంగా వేయించాలి. తర్వాత నువ్వులు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చిని విడివిడిగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం శెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, చింతపండును కూడా వేయించాలి. దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి ఉప్పు, ఇంగువ కలిపి పొడి చేయాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి పల్స్ చేస్తే అవిస గింజల పొడి రెడీ అవుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
అవిస గింజల కారప్పొడిని కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇది ఒక సూపర్ ఫుడ్ కూడా. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవిస గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తాయి. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీనిలో ఉండే పీచు పదార్థం, ప్రోటీన్ వల్ల ఈ పొడి తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, శరీరంలోని మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా ఒంట్లోని కొవ్వు వెన్నలా కరుగుతుంది.
అవిస గింజలతో పాటు ఇందులో వేసే నువ్వులలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ పొడిని ప్రతిరోజూ నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంలా పని చేస్తుంది. మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు, పీసీఓడీ (PCOD), మెనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో అవిస గింజల్లో ఉండే లిగ్నాన్స్ (Lignans) కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడి, తిన్న ఆహారం త్వరగా వంటబట్టేలా చేస్తుంది.
చిన్న పిల్లలకు ఈ పొడిని తినిపించడం వల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. పెద్దవారిలో వయసు రీత్యా వచ్చే మతిమరుపు వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు పడకుండా కాపాడి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే జుట్టు రాలడం తగ్గి, జుట్టు దృఢంగా, మెరుస్తూ పెరుగుతుంది.