
PM Modi: ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేసే ‘నారీ శక్తి వందన అధినియమ్’ అమలు దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. సోమవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘నారీ శక్తి వందన అధినియమ్’లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు.
2029 గడువుపై ఏకాభిప్రాయం
2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. స్పష్టమైన గడువు లేకుండా చట్టాన్ని ఆమోదించడం సరికాదని, అందుకే 2029 నాటికి దీనిని అమలు చేయాలనే ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు. చట్టంలోని సాంకేతిక, రాజ్యాంగ పరమైన అంశాలపై ప్రభుత్వం నిరంతరం మేధోమథనం చేస్తోందని, నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నామని ప్రధాని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక మార్పును పరిశీలిస్తోందని చెప్పారు.
మొదట కొత్త జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. జనాభా గణనలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్లను మరింత వాయిదా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 2011 జనాభా గణన లెక్కల ఆధారంగానే రిజర్వేషన్ల ప్రక్రియతో ముందుకు వెళ్లాలని కేంద్రం ఆలోచిస్తుంది. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే చర్చ గత నాలుగు దశాబ్దాలుగా సాగుతోందని, దీని వెనుక ఎన్నో తరాల కృషి ఉందని మోడీ అన్నారు. “మన పార్లమెంటు ఒక నూతన చరిత్రను సృష్టించేందుకు చేరువలో ఉంది. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాకుండా, మన పని సంస్కృతిలో భాగం కావాలి” అని ప్రధాని చెప్పారు. సమానత్వంతో కూడిన భారతదేశం అనే తీర్మానాన్ని నెరవేర్చేందుకు ఈ అడుగు అత్యంత కీలకమని ప్రధాని అభివర్ణించారు.
READ ALSO: Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..