
భోపాల్: కొత్త జంటను ఊహించని రూపంలో మృత్యువు కబళించింది. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన వధువు, వరుడిని పాడెపై స్మశానానికి సాగనంపాల్సి వస్తుందని ఇరు కుటుంబాలు కలలో కూడా అనుకోలేదు. ఒకే ఇంట్లో కలిసిమెలిసి అన్యోన్యంగా గడపాల్సిన ఈ కొత్త జంట కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరడంతో ఊరు ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో కొత్తగా పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి చనిపోయారు.
కోళ్ల దాణాతో వెళుతున్న లారీ ఆగి ఉన్న ఆటోపై బోల్తా పడింది. అదే ఆటోలో ఉన్న కొత్తగా పెళ్లైన వధూవరులతో సహా నలుగురు మరణించారు. సీసీటీవీలో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ కావడం గమనార్హం. ఆ ఫుటేజీలో లారీ అదుపు తప్పి చూస్తుండగానే సెకన్లలోనే నేరుగా ఆటో పైన పడింది. కోళ్ల దాణా బస్తాలతో లోడ్ చేసిన లారీ ఆటోపై పడటంతో ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది.
📍Shivpuri, Madhya Pradesh: A truck loaded with chicken feed overturned onto a stationary auto, where 4 people lost their lives, including a newlywed couple returning home after their wedding. The moment was captured on CCTV. pic.twitter.com/UHQvizlRX4
— Deadly Kalesh (@Deadlykalesh) April 11, 2026
దాణా బస్తాలన్నీ ఆటోపై పడటం, లారీ బాడీ కూడా ఆటోపై పడిపోవడంతో ఆటోలో ఉన్న ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు. 25 ఏళ్ల వీరేంద్ర శాక్య అనే యువకుడు ఒక రోజు క్రితమే రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక గుడిలో ఈ పెళ్లి జరిగింది. శనివారం ఈ పెళ్లి జరిగింది. పెళ్లి అయిపోగానే ఈ జంట మరో ఇద్దరు బంధువులతో కలిసి ఆటోలో సొంత ఊరికి బయల్దేరి వెళుతున్నారు.
ఆటో డ్రైవర్ రోడ్డు పక్కన ఆటోను ఆపి దుకాణానికి వెళ్లొచ్చే లోపే ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో.. వధువు, వరుడితో పాటు వరుడి తల్లి అన్వేష్ శాక్య (50), వదిన రాజో శాక్య (22) కూడా ప్రాణాలు కోల్పోయారు. విధిరాతను ఎవరూ తప్పించలేరని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. వరుడి సోదరి భూరియా శాక్య (19), డ్రైవర్ దుకాణం దగ్గర ఉండటంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.