Reading Time: < 1 minute
Srh Vs Rr 2026 Who Can Stop Vaibhav Suryavanshi At Uppal Stadium Today

Who Can Stop Vaibhav Suryavanshi at Uppal Stadium Today: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్.. మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు కీలక విజయాలు అందిస్తున్నాడు. తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు చేస్తూ ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. చెన్నైపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. తన అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బెంగళూరుపై 26 బంతుల్లో 78 పరుగులు చేసి మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను నిరూపించాడు.

ప్రత్యేకంగా ఐపీఎల్ 2026లో టాప్ బౌలర్లపై కూడా వైభవ్ సూర్యవంశీ ఎలాంటి భయం లేకుండా ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సునాయాసంగా సిక్సులు బాదాడు. టాప్ బ్యాటర్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో తడబడగా.. 15 ఏళ్ల వైభవ్ మాత్రం అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అంతేకాదు బెంగళూరు పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లను కూడా వదలలేదు. బౌండరీలు, సిక్సులతో చెలరేగాడు. 2026 ఐపీఎల్‌లో అగ్రశ్రేణి బౌలర్లను వణికిస్తున్న వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. 15 ఏళ్ల బుడ్డోడు ఇలా ఎలా ఆడుతున్నారు అని అందరూ షాక్ అవుతున్నారు.

Also Read: Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

ఇక ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే నిలిచింది. ఇప్పటికే టాప్ బౌలర్లను ఆటాడుకున్న వైభవ్.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లపై ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది. జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి, ఇషాన్ మలింగలు ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు. యువ సంచలనం సూర్యవంశీని ఆపడం వీరి వల్ల అవుతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఎవరైనా ఆపుతారో చూడాలి.