
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ఆరోపణలకు కేసీఆర్ బాధ్యత వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 13న రిజస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు సీతక్క. సీతక్క తరుపు అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించారు.
అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోందని.. అందుకు కేసీర్ బాద్యత వహించాలనంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని తెలిపారు. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో స్పష్టం చేశారు.
►ALSO READ | GSDP ఫార్ములా ప్రకారం.. డీలిమిటేషన్ జరిగితే.. తెలంగాణలో కొత్తగా పెరిగే ఎంపీ సీట్లు ఎన్నంటే..
మొత్తం టెండర్ విలువ 44 కోట్ల రూపాయలే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణగా పేర్కొన్నారు.
BRS పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు మంత్రి సీతక్క. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.