Reading Time: 2 minutes
Union Budget 2026 27 Government Borrowing Debt Gdp Fiscal Deficit

Union Budget 2026: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవ‌త్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టారు. అయితే.. ఇప్పుడు చాలా మంది కన్ను దేశంలోని అప్పులపై పడింది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రుణాలపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026–27లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రూ.17.2 లక్షల కోట్ల ($187.63 బిలియన్లు) రుణం తీసుకోనున్నట్లు ప్రతిపాదించారు. ఇది మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది.

READ MORE: Union Budget 2026-27: ఏ రంగానికి ఎంత? రవాణా, రక్షణ రంగాలకు పెద్దపీట!

అయితే నికరంగా చూస్తే మార్కెట్ నుంచి ప్రభుత్వం తీసుకునే రుణం రూ.11.70 లక్షల కోట్లుగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇది గత 2025–26 ఆర్థిక ఏడాదితో పోలిస్తే కొద్దిగా తక్కువ. అయినా మొత్తం రుణాల పరిమాణం పెద్దగా ఉండటంతో బాండ్ మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్ని నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడంతో ప్రభుత్వ బాండ్లపై డిమాండ్ కంటే సరఫరా ఎక్కువైంది. దీని ప్రభావంతో బాండ్ యీల్డ్స్ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వడ్డీ రేట్లను మొత్తం 1.25 శాతం తగ్గించినప్పటికీ, 10 ఏళ్ల గడువు ఉన్న ప్రభుత్వ బాండ్ యీల్డ్ గత ఏడాది ఫిబ్రవరి కంటే ఇప్పటికీ కొద్దిగా ఎక్కువగానే ఉంది. బడ్జెట్‌కు ముందు మార్కెట్ నిపుణులు మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్ల నుంచి రూ.17.5 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు.

READ MORE: Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..

ఇదిలా ఉండగా, ప్రభుత్వం తన ఆర్థిక విధానంలో కొత్త దృష్టికోణాన్ని తీసుకొచ్చింది. ఇకపై రుణాలు–జీడీపీ నిష్పత్తిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నిష్పత్తిని 55.6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఆర్థిక లోటును జీడీపీలో 4.3 శాతంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక లోటు అంటే ప్రభుత్వ ఖర్చులు, ఆదాయాల మధ్య తేడా. ఇది ఎంత ఉంటుందన్నదానిపై ప్రభుత్వ రుణాల అవసరం, మొత్తం అప్పుల స్థాయి, మార్కెట్ నమ్మకం అన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ సంఖ్యలను పెట్టుబడిదారులు, ఆర్థిక వర్గాలు చాలా జాగ్రత్తగా గమనిస్తుంటాయి. మొత్తంగా చూస్తే, భారీ రుణాల ప్రకటన ఒకవైపు ఆర్థిక మార్కెట్లలో ఉత్కంఠను పెంచగా, మరోవైపు దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం ఇచ్చిన హామీ కొంత భరోసానూ ఇస్తోంది.