
Shreyas Iyer Suspension: చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత సమయం కంటే నెమ్మదిగా ఓవర్లు వేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఇది జట్టు కెప్టెన్ చేసిన రెండో తప్పిదం కావడంతో బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. గత మ్యాచ్‌లో 12 లక్షల రూపాయల జరిమానా ఎదుర్కొన్న అయ్యర్‌కు, ఈసారి ఆ మొత్తాన్ని రెట్టింపు చేస్తూ 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.
జట్టు సభ్యులపై కూడా వేటు..
నిబంధనల ప్రకారం రెండోసారి తప్పిదం జరిగినప్పుడు కేవలం కెప్టెన్‌పైనే కాకుండా, తుది జట్టులో ఆడిన మిగిలిన ఆటగాళ్లపై కూడా జరిమానా పడుతుంది. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా పంజాబ్ జట్టులోని ప్రతి ఆటగాడికి 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా చెల్లించాలని బోర్డు ఆదేశించింది. మైదానంలో ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఐపీఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది.
నిషేధం ముప్పు తృటిలో మిస్..
గతంలో మూడవసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించే నిబంధన ఉండేది. అయితే, ఈ ఏడాది నుంచి ఆ నిబంధనలో మార్పులు చేశారు. కొత్త రూల్ ప్రకారం, మూడవ తప్పు జరిగినప్పటికీ కెప్టెన్ తదుపరి మ్యాచ్ ఆడవచ్చు. కానీ, అయ్యర్ ఖాతాలో డెమెరిట్ పాయింట్లు చేరతాయి. ఇవి 36 నెలల పాటు రికార్డులో ఉంటాయి. భవిష్యత్తులో మరిన్ని పాయింట్లు వస్తే దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో కూడా శిక్షగా ఒక అదనపు ఫీల్డర్‌ను సర్కిల్ లోపలే ఉంచాల్సి రావడంతో జట్టుకు నష్టం జరుగుతోంది.
విజయంపై కెప్టెన్ హర్షం..
జరిమానా పక్కన పెడితే, మ్యాచ్‌లో తమ జట్టు ప్రదర్శనపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39) అందించిన ఆరంభం అద్భుతమని కొనియాడారు. “ప్రభాసిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఇచ్చిన మెరుపు ఆరంభం వల్ల మాపై ఒత్తిడి తగ్గింది. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ చేయడం మాకు సులభమైంది” అని అయ్యర్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..