Reading Time: < 1 minute
Hyderabad: ఓ మోడల్.. భార్యాభర్తలు.. బిజినెస్‌మెన్.. రిసార్ట్‌లో అడ్డంగా బుక్కయిన ఆరుగురు..

బార్‌ అయినా, పబ్‌ అయినా, రిసార్టైనా, ఫామ్‌హౌస్‌ అయినా.. చీర్స్‌ కొట్టి చిందేస్తూ, చిల్‌ అయితే పర్లేదు.. కానీ కొందరు డ్రగ్స్‌ తీసుకుని గాల్లో తేలాలి అనుకుంటున్నారు. అలాంటి బ్యాచ్‌పై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్న ఈగల్‌ టీమ్‌.. దొరికినోళ్లను దొరికినట్టు కటకటాల్లో వేస్తోంది. ఈ ఒక్క వారంలోనే రోజుకొకటి చొప్పున డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయంటే హైదరాబాద్‌.. ‘హైడ్రగ్స్‌ బాద్‌’గా మారిందా అనే ఆందోళన కనిపిస్తోంది. తాజాగా.. హైదరాబాద్‌ వీకెండ్‌ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. వినియోగం కలకలం రేపింది.

హైదరాబాద్ గోల్కొండ తారామతి రిసార్ట్‌లో ఈగల్ టీమ్‌ దాడులు నిర్వహించింది. More Than ఫ్రెండ్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించగా.. దాదాపు 600 నుంచి 800 మంది హాజరయ్యారు. పోలీస్ రైడ్ జరిగిన సమయంలో ఈవెంట్‌లో సుమారు 300 మంది ఉన్నారు. అనుమానితులు.. 36 మందికి డ్రగ్ టెస్టు నిర్వహించగా అందులో ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్ గా నమోదైంది. ఆరుగురిలో ఒక మహిళ కూడా ఉన్నారు. పాజిటివ్ వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. More than ఫ్రెండ్స్ పేరుతో జరిగిన ఈవెంట్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం సేవించినట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో బీర్, వోడ్కా, విస్కీ బాటిల్స్ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పడి ఉన్నాయి.

దొరికిన వారిలో భార్యాభర్తలు, మోడల్..

నిన్న రాత్రి రాత్రి డ్రగ్స్‌ తీసుకుని దొరికిన ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. అందులో ఓ మహిళ కూడా ఉంది. అయితే.. భార్యాభర్తలే మాదకద్రవ్యాలు తీసుకుని దొరకడం పోలీసుల్నే షాక్‌కి గురి చేసింది. డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చిన ఆరుగురిని ఈగల్‌ టీమ్‌ ప్రశ్నిస్తోంది. DJ ప్లేయర్‌ కమ్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ జాసన్‌కి డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చింది. ఓ మోడల్‌తోపాటు మరో వ్యాపారవేత్త, ఒడిశా వ్యక్తి అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ పార్టీపై నిఘా పెట్టిన ఈగల్‌ టీమ్‌ అనుమానం వచ్చిన వాళ్లకు టెస్ట్‌లు చేయడం, ఆ వెంటనే అదుపులోకి తీసుకుని విచారించడం చకచకా జరిగిపోయాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..