Reading Time: 2 minutes

ఒకేసారి రెండు యూఎస్ ఫైటర్ జెట్లను కూల్చిన ఇరాన్.. సీక్రెట్ ఆయుధం ఇదేనా!

Caption of Image.

ఇరాన్ గగనతలంలో విహరించడం ఇకపై అమెరికాకు నల్లేరు మీద నడక కాదనిపిస్తోంది. ఒకప్పుడు టెహ్రాన్ గగనతలంపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించిన అగ్రరాజ్యానికి ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. గడిచిన 24 గంటల్లో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ఇరాన్ టార్గెట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత 20 ఏళ్లలో శత్రువుల దాడిలో అమెరికా ఫైటర్ జెట్స్ కూలిపోవడం ఇదే తొలిసారి.

అసమాన యుద్ధ తంత్రం.. ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ!

సైనికపరంగా అమెరికాతో ఇరాన్ ఏమాత్రం సరితూగలేనప్పటికీ, తన  అసమాన యుద్ధ తంత్రంతో అగ్రరాజ్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇరాన్ వద్ద విమాన విధ్వంసక వ్యవస్థలే లేవని, వారి గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోనే ఉందని మార్చి 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత ఇరాన్ విసిరిన  గూగ్లీ కి అమెరికా ఖంగుతిన్నది.

ఇరాన్ దళాలు (IRGC) ఒక అమెరికన్ F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌ను కూల్చివేశాయి. గాలింపు చర్యలకు వచ్చిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపైనా దాడి చేశాయి. కువైట్ గగనతలంలో మరో A-10 వార్తొగ్ విమానం కూడా కుప్పకూలింది.

ఏమిటీ ‘మజిద్’ (Majid) సిస్టమ్? 

ఇంతటి అత్యాధునిక అమెరికా విమానాలను ఇరాన్ ఎలా కూల్చగలిగింది?  దీనికి సమాధానం ఇరాన్ 2021లో ప్రవేశపెట్టిన  మజిద్ (Majid) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని ప్రత్యేకతలు శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇది రాడార్ వ్యవస్థపై ఆధారపడదు. ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌తో కూడిన  పాసివ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. సిగ్నల్స్ విడుదల కావు కాబట్టి దాడి జరిగే వరకు విమానంలోని వార్నింగ్ సిస్టమ్స్ దీనిని పసిగట్టలేవు. 8 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల ఎత్తు వరకు టార్గెట్ రేంజ్ లక్ష్యాలను ఛేదించగలదు. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు 15 కి.మీ వరకు పసిగట్టగలవు.

►ALSO READ | అమెరికా రాజధాని మేయర్ రేసులో భారతీయ మహిళ.. అసలు ఎవరు ఈ రిని సంపత్..?

వెలుపలి ‘కషెఫ్-99  (Kashef-99) సిస్టమ్‌తో అనుసంధానించడం వల్ల దీని ట్రాకింగ్ సామర్థ్యం 30 కిలోమీటర్లకు పెరుగుతుంది. ఒకేసారి 8 క్షిపణులను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్న మల్టీ-టార్గెటింగ్ సిస్టమ్ ఇది. 

F-35 కూల్చివేత వెనుక..

అత్యంత అధునాతన అమెరికన్ స్టెల్త్ ఫైటర్ F-35 విపరీతమైన వేడిని విడుదల చేస్తుంది. అదే దానికి శాపంగా మారింది. మజిద్ సిస్టమ్ లోని ఇన్‌ఫ్రారెడ్ గైడెన్స్ ఈ వేడిని పసిగట్టి కచ్చితత్వంతో దాడి చేసిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి MQ-9, హెరాన్ వంటి ఎన్నో ఖరీదైన డ్రోన్లను ఈ సిస్టమ్ నాశనం చేసింది.

భూగర్భంలో  మిస్సైల్ సిటీలు 

గతేడాది జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది ఇరాన్. ఒకేచోట స్థిరంగా ఉండే వాయు రక్షణ కేంద్రాలను తొలగించి,  మొబైల్ లాంచర్ల వైపు మళ్లింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రతిరోజూ దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ క్షిపణి లాంచర్లు ఇంకా చెక్కుచెదరలేదు. ఎందుకంటే, ఆయుధ సంపత్తిని ఇరాన్ భూగర్భంలోని భారీ  మిస్సైల్ నగరాలు,  రహస్య సొరంగాలు, కఠినమైన తీరప్రాంతాల్లో దాచిపెట్టింది. అగ్రరాజ్యాల ఇంటెలిజెన్స్ అంచనాలకు అందని విధంగా వేలాది క్షిపణులను గుహల్లో భద్రపరిచినట్లు తెలుస్తోంది. 

పాడైపోయిన వాయు రక్షణ వ్యవస్థ అంటే పూర్తిగా ధ్వంసమైనట్లు కాదు. వారు ఇంకా పోరాడుతూనే ఉన్నారంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు” అని విశ్లేషకులు చెబుతున్న మాటలు ఇరాన్ ప్రస్తుత బలానికి అద్దం పడుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.