
చెన్నైకు మూడో ఓటమి
బెంగళూరు: ఐపిఎల్2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 250 పరుగుల భారీ లక్ష ఛేదనకు దిగిన చెన్నైకు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని 207 పరుగులకే కట్టడి చేశారు. దీంతో చెన్నై వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. చెన్నై బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్(50), ప్రశాంత్ వీర్(43), జెమీ ఓవర్టన్(37)లు తప్ప వరెవరూ రాణించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. జకోబ్ డఫ్ఫీ, అభినందన్ సింగ్, కృనాల్ పాండ్య రెండేసి వికెటుల దక్కించుకున్నారు. సుయాస్ శర్మ ఓ వికెట్ పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్‌లు శుభారంభం అందించారు. సాల్ట్ 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. ఇక కోహ్లి 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. దేవ్‌దుత్ పడిక్కల్ 29 బంతుల్లోనే 50 పరుగులు చేసి స్కోరును పరిగెత్తించాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పటిదార్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయిన డేవిడ్ 25 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పటిదార్ 19 బంతుల్లోనే 6 సిక్సర్లు, ఓ ఫోర్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు స్కోరు 250 పరుగులకు చేరింది.