
సొంత దేశంలో ప్రజలకు కడుపునిండా తిండి పెట్టలేని స్థితి, మంత్రులకు 6 నెలల పాటు జీతాలు కూడా చెల్లించలేని దారిద్య్రం, అప్పులు తీర్చలేక అరబ్ దేశాల ముందు సాగిలపడాల్సిన దుస్థితి.. ఇదీ ప్రస్తుతం పాకిస్థాన్ వాస్తవ ఆర్థిక పరిస్థితి. లోపల ఇన్ని సమస్యలు పెట్టుకుని కూడా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం భారత్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఈసారి యుద్ధం వస్తే గతంలో లాగా సరిహద్దుల వద్ద ఆగిపోమని.. ఏకంగా భారతీయుల ఇళ్లలోకి చొరబడి కొడతామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాస్యాస్పదంగా మారాయి.
ఈసారి భారతదేశంతో యుద్ధం 200-250 కిలోమీటర్లకే పరిమితం కాదని, తామే నేరుగా భారత్‌లోకి చొరబడతామంటూ పాక్ రక్షణ మంత్రి బీరాలకు పోయారు. ఇళ్లలోకి వెళ్లి మరీ దాడులు చేస్తాం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ క్యాంపులను టార్గెట్ చేస్తాం అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. గతేడాది భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తో కుదేలైన పాకిస్థాన్.. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు పేలుతోందని నిపుణులు అంటున్నారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరించినట్లుగా.. పాక్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారత్ నుంచి గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
నిజానికి పాకిస్థాన్ ఈ స్థాయిలో విర్రవీగడం వెనుక పెద్ద వ్యూహం ఏమీ లేదు. ఇది కేవలం వారిలోని భయం, నిస్సహాయతను సూచిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘన్ తాలిబన్లతో యుద్ధం చేస్తోంది. దేశంలోనే బలూచిస్థాన్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజల తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉంది. వీటిని అదుపు చేయలేక, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేక.. ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్‌ను బూచిగా చూపిస్తోంది. ఏ దేశమైనా యుద్ధం చేయాలంటే గుండె ధైర్యంతో పాటు ఖజానాలో డబ్బు కూడా ఉండాలి. ప్రస్తుతం పాకిస్థాన్ విషయం చూస్తే కనీసం తన దేశంలోని మంత్రులకే జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండి భారీ యుద్ధాన్ని ఎలా కొనసాగిస్తుందన్నదే అతిపెద్ద ప్రశ్న.
అంతేకాకుండా పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ లాంటి వారు కూడా అమెరికా మమ్మల్ని కొడితే, మేము ఢిల్లీ, ముంబైలను కొడతాం అంటూ పనికిమాలిన సలహాలు ఇస్తున్నారు. ఇవన్నీ కేవలం మైండ్ గేమ్స్ మాత్రమేనని, క్షేత్రస్థాయిలో భారత్‌తో తలపడే సత్తా పాకిస్థాన్‌కు ఏమాత్రం లేదని రక్షణ రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. 2025 మే నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ జరిపిన దాడుల దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది. ఆ గాయాన్ని మర్చిపోయి మళ్లీ గెలికితే.. ఈసారి పాక్ అనే దేశం మ్యాప్‌లో ఉంటుందో లేదో అన్న సందేహాలు కలుగుతున్నాయి. అప్పుల కోసం అల్లాడుతూ.. ఆయుధాల గురించి మాట్లాడటం పాక్ పాలకుల తెలివి తక్కువ తనాన్ని సూచిస్తోంది.