Reading Time: 2 minutes
గుండె జబ్బుల కోసం ఈ మందులు వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండెను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా స్టాటిన్ మందులను విస్తృతంగా ఉపయోగిస్తారు. రోసువాస్టాటిన్ ఈ మందులలో ఒకటి. ఇది చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. అయితే, కొత్త పరిశోధన ఈ మందు గురించి మూత్రపిండాల సమస్యలకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆందోళనను రేకెత్తిస్తుంది. ఇది మీ మూత్రపిండాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూత్రపిండాలపై రోసువాస్టాటిన్ ప్రభావాలను వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. వాస్తవానికి, ఈ మందును యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మొదట ఆమోదించినప్పుడు, ప్రాథమిక పరీక్షలలో కొంతమంది రోగులలో మూత్రంలో రక్తం, ప్రోటీన్ వంటి మూత్రపిండాలకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి. ఈ సంకేతాలు మూత్రపిండాల పనితీరులో లోపాన్ని సూచించాయి. అయితే, రోసువాస్టాటిన్ దీర్ఘకాలిక ప్రభావాలపై పెద్ద ఎత్తున పరిశోధన పెద్దగా జరగలేదు. ఈ కొత్త అధ్యయనం ఈ లోటును పూరించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ అధ్యయనం 9 లక్షల మందికి పైగా ప్రజల ఆరోగ్య రికార్డులను విశ్లేషించింది. వీరిలో, సుమారు 1,50,000 మంది రోసువాస్టాటిన్ తీసుకుంటుండగా, దాదాపు 8 లక్షల మంది అటోర్వాస్టాటిన్ అనే మరో స్టాటిన్ ఔషధాన్ని వాడుతున్నారు. ఈ రోగులందరి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మూడు సంవత్సరాల పాటు పర్యవేక్షించారు. ఈ అధ్యయనం ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రోసువాస్టాటిన్ తీసుకుంటున్న వారిలో సుమారు 2.9 శాతం మంది మూత్రంలో రక్తం కనపడగా, 1 శాతం మంది మూత్రం ద్వారా ప్రోటీన్‌ లక్షణాలు కనిపించాయి. అటోర్వాస్టాటిన్ తీసుకుంటున్న వారితో పోలిస్తే, రోసువాస్టాటిన్ తీసుకుంటున్న వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.

ప్రమాదాలు ఏమిటి?

పరిశోధన ప్రకారం, రోసువాస్టాటిన్ తీసుకుంటున్న వారికి హెమటూరియా (మూత్రంలో రక్తం) వచ్చే ప్రమాదం 8 శాతం, ప్రొటీనూరియా (మూత్రంలో ప్రోటీన్) వచ్చే ప్రమాదం 17 శాతం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, వారికి తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వచ్చే ప్రమాదం కూడా 15 శాతం ఎక్కువగా ఉంది. దీనికి డయాలసిస్, మూత్రపిండ మార్పిడి అవసరం కావచ్చు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, మందు మోతాదు పెరిగే కొద్దీ ఈ ప్రమాదం కూడా పెరిగింది. అంటే, రోసువాస్టాటిన్‌ను అధిక మోతాదులో తీసుకుంటున్న రోగులకు మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా, ముందు నుంచే మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులకు తరచుగా ఈ మందును అధిక మోతాదులో ఇస్తున్నారని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది, ఇది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సులకు విరుద్ధం. ఆసక్తికరంగా, గుండెను రక్షించడంలో రోసువాస్టాటిన్, అటోర్వాస్టాటిన్ రెండూ సమానంగా ప్రభావవంతంగా ఉన్నాయని కనుగొన్నారు. అంటే గుండెపోటు, పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ రెండు మందులు సమానంగా బాగా పనిచేస్తాయి.

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..