కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్) అనే పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌లో భాగంగా పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెట్ వర్క్ ఆస్పత్రుల్లో పేదలు ఈ పథకంతో ఉచితంగా ట్రీట్మెంట్ పొందవచ్చు.
ఏడాదికి రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. కుటుంబసభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. హాస్పిటల్ ఖర్చులతో పాటు మెడికల్ బిల్లులకు కూడా ఇది కవరేజీ ఇస్తుంది. పూర్తిగా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఆస్పత్రుల్లో పొందవచ్చు. 70 ఏళ్లుపైబడినవారు కూడా దీనికి అర్హులు. ఆస్పత్రిలో చేరడానికి 3 రోజుల ముందు, డిశ్చార్జ్ తర్వాత 15 రోజుల వరకు అయ్యే మందుల ఖర్చులకు ఆయుష్మాన్ భారత్‌లో కవరేజీ లభిస్తోంది.
పేదలు, బలహీన వర్గాలు ఈ పథకానికి అర్హులు. ఇక కుటుంబంలో 70 ఏళ్లు నిండినవారు ఉంటే అదనంగా రూ.5 లక్షల కవరేజీ ఉంటుంది. వీరికి వయో వందన కార్డు ప్రత్యేకంగా అందిస్తారు. ఇంట్లో వృద్దులు ఉంటే మొత్తం రూ.10 లక్షల వరకు కవరేజీ లభిస్తుంది. ఆదాయంతో సంబంధం లేకుండా వృద్దులకు వయో వందన కార్డు కింద ప్రయోజనం కల్పిస్తారు.
వృద్దులు ఆధార్ ఆధారిత ఈకేవైసీ విధానం ద్వారా వయో వందన కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఆయుష్మా్న్ భారత్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే నేషనల్ హెల్త్ పోర్టల్, ఆయుష్మాన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్‌కు వెళ్లి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇక మీకు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ మిత్రలు అందుబాటులో ఉంటారు. వీరిని సంప్రదించి అయినా ఆయుష్మాన్ భారత్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ అందిస్తే సరిపోతుంది. మీ అర్హతను పరిశీలించి ఆయుష్మాన్ భారత్ కార్డు జారీ చేస్తారు.




