
కేరళలో ఎల్డీఎఫ్ పూర్తిగా విఫలమైందని.. పరిపాలన ప్రమాణాలు, మానవీయ విలువలు దిగజారిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత విదేశాలకు వలస వెళ్తుండగా, రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు సరైన సంక్షేమం అందడం లేదని అన్నారు. కేరళం రాష్ట్రంలోని పతనం తిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళంలో గొప్ప మార్పు, మెరుగైన సంక్షేమం, సుపరిపాలన, సెక్యులర్ విలువలను స్థాపించాలంటే ఈనెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కేరళం అంటే సెక్యులరిజం, ఉన్నత విద్య, మానవీయ విలువల ప్రతీకగా భావిస్తాం. కానీ ప్రస్తుతం ఆ విలువలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిజం, మార్క్సిజం పేరుతో వచ్చిన ప్రభుత్వం గుండాయిజం వైపు మళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన, శాంతి, సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఎవరైనా అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి పరిశీలించాలని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు వేల కోట్ల భారం కుటుంబాలపై తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేదలకు రూ.500 గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణం చేపట్టామని వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం భారీ మొత్తంలో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, విద్య మరియు వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు.
కేరళంలో యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే కాలేజీకి వెళ్లే మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక సహాయం, యువతకు వడ్డీ లేని రుణాలు, సామాజిక పెన్షన్ పెంపు వంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమెన్ చాందీ పేరుతో వృద్ధుల కోసం ప్రత్యేక బీమా పథకం తీసుకువస్తామని తెలిపారు. అలాగే వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళం ప్రజలు మార్పు కోసం యుడిఎఫ్‌కు మద్దతు ఇవ్వాలని భట్టి పిలుపునిచ్చారు.