
హైదరాబాద్ సిటీలో ఓ డిసిఎం వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. శనివారం అర్ధరాత్రి నగరంలోని మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న అర్థరాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైండ్ స్పేస్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ డిసిఎం.. ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ.. డిసిఎం వాహనం కింద ఇరుక్కుపోయింది.
అయితే, డిసిఎం డ్రైవర్.. ఆపకుండా అలాగే దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు స్కూటీని ఈడ్చుకెళ్లాడు. రోడ్డుపై వెళ్తున్న కొందరు గమనించి.. డిసిఎం ను వెంబడించి అడ్డుకున్నారు. దీంతో డ్రైవర్, వాహనం నుంచి దిగి పారిపోగా.. అతని సహాయకుడిని స్థానికులు పట్టుకున్నారు. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని డిసిఎం కింద నుంచి బయటకు తీసి వెంటనే అంబులెన్స్ లో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పట్టుబడిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.