
హైదరాబాద్: వాయిదా పడ్డ మున్సిపాలిటీలలో ప్రజాస్వామ్యం గెలిచిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కోటాలో వేసుకోవాలని విశ్వప్రయత్నం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎవరెన్ని ప్రలోభాలకు పెట్టినా బిఆర్ఎస్ వైపు నిలిచిన కౌన్సిలర్లకు, కాంగ్రెస్ ప్రలోభాలకు ప్రజలు లొంగకుండా బిఆర్ఎస్ ను ఓట్లేసి గెలిపించారని, ఎన్నికల వరకు తీసుకొచ్చిన మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేటి పరిస్థితులను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోందని సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.