
తిరువనంతపురం: కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ను అధికారంలోకి రాకుండా చేయాలని.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)తో చేతులు కలిపిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్‌డీఎఫ్ ఇకపై వామపక్ష కూటమి కాదని..మత హింసను ప్రేరేపించే వారితో జత కట్టిందని రాహుల్ విమర్శించారు.
కేరళలోని ఎర్నాకుళంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎల్‌డీఎఫ్ బీజేపీకి ఎప్పటికీ ముప్పు కాలేదని.. కాషాయ పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే సవాలు విసరగలదని అన్నారు. “ఈ ఎన్నికలు ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌ల మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, ఎల్‌డిఎఫ్‌ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని.. ఇది అందరికీ స్పష్టంగా తెలుసు” అని అన్నారు.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు.. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, తనపై 36 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను 55 గంటల పాటు విచారించిందన్నారు.ఇక, శబరిమల ఆలయంలోని బంగారం వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్‌డిఎఫ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆలయంలోని బంగారాన్ని ఎల్‌డిఎఫ్ నాయకులు దొంగిలించారని, దీనిపై మోడీ మౌనం వహించారని ఆయన ఆరోపించారు.