Reading Time: < 1 minute
Andhra News: వీడేం దొంగరా బాబు.. పీఎస్‌ ఎదుట రూ.5లక్షల చోరీ.. సీసీ ఫుటేజ్ చూసి..

అద్దంకి పట్టణంలోని ప్రధాన రహదారి.. ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. రాత్రి వేళల్లో కూడా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం. కానీ, దొంగలు మాత్రం డోంట్ కేర్ అన్నారు. అదే ప్రాంతాన్ని టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతూ పోలీసుకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆకృతి బట్టల షోరూంలో చొరబడి ఓ దొంగ ఉన్నకాడికి దోసుకెళ్లాడు. పక్కా ప్లాన్‌తో వచ్చిన కేటుగాడు  షోరూం పైభాగంలో ఉన్న రేకుల షెడ్డును కట్ చేసి లోపలికి ప్రవేశించాడు.

తెల్లటి దుస్తులు, తలకు టోపీ ధరించిన ఆ దొంగ.. ఎంతో నిమ్మళంగా షోరూం లోపల కలియదిరిగాడు. క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకుని, డ్రాయర్లను క్షుణ్ణంగా వెతికాడు. అందులో ఉన్న సుమారు 5 లక్షల రూపాయల నగదును బ్యాగులో సర్దుకుని, వచ్చిన దారినే దర్జాగా చెక్కేశాడు. కనీసం ఎవరికీ అనుమానం రాకుండా, అత్యంత చాకచక్యంగా ఈ చోరీకి పాల్పడ్డాడు.

ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది, క్యాష్ కౌంటర్ చిందరవందరగా ఉండటంతో ఒక్కసారిగా విస్తుపోయారు. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అద్దంకి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. షోరూం ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ, దొంగలు ఇంత సాహసానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు. ఒంగోలు నుంచి క్రైమ్ బ్రాంచ్ బృందాన్ని, క్లూస్ టీమ్‌ను పిలిపించారు. నిందితుడు తాకిన ప్రదేశాల నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ ఏ మార్గంలో వచ్చాడు? ఎటు వైపు వెళ్ళాడు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీస్ స్టేషన్ రోడ్డులో అర్ధరాత్రి కూడా వాహనాలు తిరుగుతుండగా.. ఇంత పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురవ్వడం చూస్తుంటే, దీని వెనుక పాత నేరస్తుల హస్తం ఉందా? లేక లోపలి వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.