
- రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్
వరంగల్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో విద్యుత్ రంగంలో మూడు రోజులు పట్టే పనులను కేవలం 10 నిమిషాల్లోనే పూర్తి చేయగలిగే సామర్థ్యం ఏర్పడిందని రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ భవన్‌లో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘ఏఐ హ్యాకథాన్’ హైలెవల్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగంలో టైప్ రైటింగ్ దశ నుంచి ఏఐ ఆధారిత డిజిటల్ విప్లవం వరకు భారీ మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.
ఏఐ మనిషి సృష్టించిన అద్భుతమని, దీనిని సక్రమంగా వినియోగిస్తే ఎన్‌పీడీసీఎల్ సంస్థలో వేగం, కచ్చితత్వం, పారదర్శకత పెరిగి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ద్వారా విద్యుత్ సంస్థల సేవలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఓగ్లాపూర్‌లోని 400 కేవీ మానవరహిత సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. సమావేశంలో తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ, డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, సీజీఎంలు పాల్గొన్నారు.