
Story Board: ఇరాన్ పై చేస్తున్న దాడులతో అమెరికా తీవ్ర నష్టాలకు గురవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధం వల్ల కలుగుతున్న విపరీతమైన వ్యయం దేశాన్ని భారీ రుణ ఊబిలోకి నెడుతుండటంతో, యుద్ధాన్ని తక్షణమే ముగించాలని వైట్ హౌస్ సలహా మండలి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఒకవైపు రికార్డు స్థాయికి చేరుతున్న జాతీయ అప్పు, మరోవైపు సామాన్య అమెరికన్లపై పడుతున్న ద్రవ్యోల్బణ భారం ఇప్పుడు ట్రంప్ యంత్రాంగానికి పెను సవాలుగా మారింది. ఈ యుద్ధంలో ఆర్థిక వ్యయాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ తయారీ షాహెద్-136 వంటి వన్-వే అటాక్ డ్రోన్ల ధర కేవలం 20 వేల నుండి 50 వేల డాలర్లు మాత్రమే కాగా, వాటిని గాలిలోనే అడ్డుకోవడానికి అమెరికా ఉపయోగిస్తున్న ఇంటర్‌సెప్టర్ మిస్సైళ్ల ధర ఒక్కో షాట్‌కు 15 లక్షల నుండి 40 లక్షల డాలర్ల వరకు ఉంటోంది. అంటే, శత్రువు ప్రయోగించే అతి తక్కువ ధర ఆయుధాలను ఎదుర్కోవడానికి అమెరికా వందల రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం వల్ల భారీగా ఖర్చు అవుతోంది.
ప్రస్తుత గణాంకాల ప్రకారం, అమెరికా ఈ యుద్ధం కోసం సగటున రోజుకు 100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోందని అంచనా . మార్చి 2026 నాటికి అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 38.9 ట్రిలియన్ల డాలర్లకు చేరకుంది. గత కొద్ది కాలంగా ఈ అప్పు ప్రతి 100 రోజులకు సుమారు 1 ట్రిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతుండటంతో ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశ రక్షణ బడ్జెట్ కంటే కూడా అప్పుపై కట్టే వడ్డీయే ఎక్కువగా ఉండటం అమెరికా ఆర్థిక పునాదులను కదిలిస్తోంది. మరోవైపు, అమెరికా వీధుల్లో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. స్వదేశంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యంపై వెచ్చించాల్సిన పన్నుల సొమ్మును ఇతర దేశాల యుద్ధాల కోసం తగలేయడంపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2026 నవంబర్‌లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల ఆగ్రహాన్ని చల్లార్చాలంటే యుద్ధాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ట్రంప్ సన్నిహితులు బలంగా వాదిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్, ఇప్పుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. అంతర్జాతీయ దౌత్యం కంటే దేశ ఆర్థిక స్థిరత్వమే ముఖ్యం అని భావిస్తున్న వైట్ హౌస్ సలహాదారులు, ఇరాన్‌తో ఒక శాంతి ఒప్పందానికి రావాలని ట్రంప్‌ను కోరుతున్నారు. యుద్ధం ఇలాగే మరికొన్నాళ్లు కొనసాగితే అమెరికా డాలర్ ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాను ఇప్పుడు అప్పుల భయం వెంటాడుతోంది. ఐదు నెలల క్రితమే ఈ అప్పు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, అంతలోనే మరో ట్రిలియన్ పెరగడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా ఈ అప్పులు పెరుగుతుండటం వల్ల అమెరికా ఆర్థిక క్రమశిక్షణపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ అప్పులపై చెల్లించాల్సిన వడ్డీ భారం ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభంగా మారుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అమెరికా తన రక్షణ బడ్జెట్ లేదా మెడికెయిడ్ వంటి కీలక ప్రజా సంక్షేమ పథకాలపై ఖర్చు చేసే దానికంటే ఎక్కువగా కేవలం అప్పుల వడ్డీలకే చెల్లిస్తోంది. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేటాయించే నిధుల కంటే వడ్డీలే ఎక్కువగా ఉండటం ఆ దేశ భవిష్యత్తుకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ వడ్డీ భారం రాబోయే పదేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.
అమెరికాకి మాంద్యం ముప్పు ముంచుకొస్తోందని ఫెడ్ రిజర్వ్ ఇప్పటికే హెచ్చరించింది. వినియోగదారుల వ్యయం తగ్గడం, వడ్డీ రేట్ల నిరంతర పెరుగుదల కారణంగా ఈ ప్రమాదం తీవ్రమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా మాంద్యం ముప్పు పెరుగుతోందని ఫెడరల్ రిజర్వ్ విశ్లేషించింది. ఇప్పటికే అమెరికాలో 2008 మాంద్యాన్ని మించిన సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయి. ఎడాపెడా ఉద్యోగాలు పోతున్నాయి. నిత్యావసరాల ధరలు భయంకరంగా పెరిగాయి. చివరకు ఇంధన ధరలు కూడా విపరీతంగా పెరగటం.. ఆర్థికవ్యవస్థకు పెనుముప్పు హెచ్చరికలు పంపుతోంది. అమెరికా ఎగుమతులు కూడా నిలిచిపోవడం ఆ దేశానికి మరింత దెబ్బే. హర్మూజ్ జలసంధి మూసివేతతో మిగతా ప్రపంచంతో పాటు అమెరికా కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మాట నిజం. కానీ దాన్ని తెరిచే మార్గం కనిపించక.. అగ్రరాజ్యం.. నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.
అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుందన్న సంకేతాలు.. రాజకీయ వ్యవస్థలోనూ అలజడికి దారితీస్తున్నాయి. దీనంతటికీ ఇరాన్ యుద్ధమే కారణమని ప్రస్తుతానికి అనిపిస్తున్నా.. అసలు సంక్షోభానికి మూలాలు.. కొన్నేళ్ల క్రితంలోనే ఉన్నాయనే వాదన లేకపోలేదు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా వ్యవస్థను.. ట్రంప్ మరింతగా కూలదోశారనడంలో సందేహం లేదు. అసలు యుద్ధాలే చేయనని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇరాన్‌తో అంతం లేని యుద్ధం చేస్తూ.. అమెరికాను సంక్షోభంలోకి నెట్టేశారు. ఈ ప్రభావం ట్రంప్ యంత్రాంగంపై ఇప్పటికే పడింది. అమెరికా పరువు తీస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో.. కీలక స్థానాల్లో ఉన్నవారు నెపాన్ని ఇతరులపై నెట్టేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కీలక అధికారులు రాజీనామా చేశారు. సాక్షాత్తు అమెరికా ఇంటెలిజెన్స్.. అధ్యక్షుడికి భిన్నంగా ఆలోచిస్తోంది. ఇక వీటన్నింటికీ పరాకాష్టగా అమెరికా ఆర్మీ చీఫ్‌ను హఠాత్తుగా తొలగించారు. చివరకు రక్షణ మంత్రే యుద్ధానికి కారణమని బ్లేమ్ గేమ్ కు తెరతీశారు ట్రంప్. అయితే ప్రస్తుతానికి రక్షణ మంత్రి పదవి సేఫ్‌గానే ఉన్నా.. అది ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేని దుస్థితి. ఇలా ఆర్థిక సంక్షోభంతో పాటు విధానపరమైన గందరగోళంలో పడ్డ అమెరికా.. ఇంకా ఎంతోకాలం ప్రపంచ ఆర్థికానికి దిక్సూచిగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.
గల్ఫ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇరాన్ యుద్ధం కారణంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయింది గల్ఫ్ అంటే అతిశయోక్తి ఏమాత్రం కానే కాదు. ఈ ఉద్రిక్తతలు ఏప్రిల్ వరకు కొనసాగి, రవాణా వ్యవస్థ స్తంభిస్తే ఖతార్, కువైట్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏకంగా 14 శాతం మేర కుంగిపోయే ప్రమాదం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతోంది. 1990లలో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇదే కానుంది. కరోనా మహమ్మారి కలిగించిన నష్టం కంటే కూడా ఈ యుద్ధం వల్ల కలిగే నష్టమే తీవ్రంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చమురు ఎగుమతులపైనే ఆధారపడ్డ ఈ దేశాలకు ఆదాయ మార్గాలు మూసుకుపోవడం పెను సవాలుగా మారింది. సౌదీ జీడీపీ 3 శాతం, యూఏఈ జీడీపీ 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. కేవలం చమురు రంగమే కాకుండా, పర్యాటకం, రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులు కూడా ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.
ప్రస్తుతం యుద్ధం ఆరు వారాలు పూర్తిచేసుకున్నా.. శాంతి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఖతార్ నుంచి వెళ్లే గ్యాస్ ఎగుమతులు కూడా భారీగా పడిపోయాయి. ఒకవేళ ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే.. గల్ఫ్ దేశాలు సాధించిన దశాబ్దాల ఆర్థిక ప్రగతి దాదాపు 40 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి పాతికేళ్ల క్రితమే గల్ఫ్ దేశాలు తమ ఎకానమీ రూపాన్ని మార్చేశాయి. కేవలం చమురు ఆదాయంపైనే ఆధారపడకుండా తమ ప్రాంతాలను టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఎడ్యూకేషన్ హబ్, ఐటీ రంగాల టార్గెట్ అభివృద్ధి చేశాయి. ఒక దేశాన్ని నిర్మించాలంటే ఎంత కష్టం. పాతిక, 30 ఏళ్లలో అన్ని రకాలుగా అబుదాబీ, దుబాయ్, షార్జా వంటి నగరాలు అభివృద్ధి చెందాయి. దుబాయ్…ప్రపంచ విమానయానికి ట్రాన్సిట్ సెంటర్‌గా మారింది. అంతేకాదు…ప్రపంచ వాణిజ్యానికి హబ్‌గా మారింది దుబాయ్. ఒక రోల్స్ రాయిస్ కారు తయారైతే…దాన్ని మొదట ప్రదర్శించేది దుబాయ్‌లోనే. దుబాయ్, అబుదాబీలో ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలను నెలకొల్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్‌లు ఉన్నాయి. వాణిజ్య సంస్థలు సైతం అక్కడే ఉన్నాయి. ఆలయాలను నిర్మించారు. స్వామినారాయణ్ టెంపుల్‌ను కట్టారు. క్రైం జీరో రేటు కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ పెట్టుబడులను ఆహ్వానించారు. దుబాయ్, అబుదాబీలో వందరూపాయలు పెడితే…వెయ్యి రూపాయలు అవుతుందని తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని, ఇండియాతో పాటు ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఇన్వెస్టర్లు తరలివచ్చి…లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. హోటల్స్, పర్యాటక రంగం అంచనాలకు మించి అభివృద్ధి చెందింది. గల్ఫ్ దేశాలంటే ప్రపంచంలోనే అందరికి ఒక నమ్మకం పెరిగింది. పాతికేళ్లు కష్టపడి…ఆ నమ్మకాన్ని జనరేట్ చేసుకున్నాయి దుబాయ్, అబుదాబీ లాంటి ప్రాంతాలు. ఈ రోజు భారత్ దేశం నుంచి లక్షల మంది స్థిరనివాసం ఏర్పచుకున్నారంటే ఆ ప్రాంతాలపైన ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అందుకే యూఏఈని సేఫ్ హెవన్ అని పిలుస్తున్నారు. మనుషులకు…వారి ఆస్తులకు., సంపదకు అంతరక్షణ కల్పిస్తాయి కాబట్టే…యూఏఈని అంత అత్యుత్తమ టైటిల్‌తో పిలుస్తారు. అలాంటి గల్ఫ్ దేశాలు, యూఏఈ ప్రాంతాలు…అమెరికాతో అంటకాగి…ఇప్పుడు కుదేలయిపోయాయి.
పామ్ జుమైరా, బుర్జ్ ఖలీఫా, చుట్టు పక్కల ప్రాంతాలు బాంబు దాడులతో దద్దరిల్లిపోతే…ఇక దుబాయ్ సేఫ్ హెవన్ ఎలా అవుతుంది. ఇన్నాళ్లు దుబాయ్‌ను నమ్ముకున్న ఇన్వెస్టర్లు, ఒక్కసారిగా సింగపూర్, ఇతర ప్రాంతాలవైపు మళ్లారు. దుబాయ్ లో పెట్టుబడులు పెట్టిన వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అమెరికాతో స్నేహం చేసిన, అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు ఇపుడు యూఏఈ దారుణమైన పరిస్థితులను ఫేస్ చేస్తోంది. అబుదాబీ, షార్జా, దుబాయ్, ఖతార్, ఇవన్నీ ఒక్క రోజులో ఏర్పడినవి కాదు. ఆ దేశాలు ప్రాంతాల వెనుక మూడు దశాబ్దాల అవిరామ కృషి ఉంది. ఆగ్నేయాసియా దేశాల్లాగా…బ్యాంకాక్, సింగపూర్‌లాగా సహజసిద్ధంగా ఏర్పడిన దేశాలు కావు. ఏడారిలో ఇసుక, చమురు తప్పా మరేమీ లేని దేశాలు. అలాంటి దేశాలను శిల్పం చెక్కినట్లుగా పాతిక 30 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ప్రపంచమంతా నమ్మకం పెట్టుకునే ప్రాంతాలుగా మార్చారు. 70 శాతం ఎయిర్‌లైన్స్‌ను అరబ్ ఏమిరేట్స్, ఖతార్ ఎయిర్ వేస్, ఇతిహాద్ ఎయిర్ వేస్, గల్ఫ్ ఎయిర్ వేస్… ప్రపంచం మొత్తం 70 శాతం విమానాలను ఈ దేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు తప్పా ఏం లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్‌గార్డెన్స్ పెట్టారు. ఆలయాలు కట్టారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వచ్చాయి. అంతర్జాతీయ బ్యాంక్‌లన్నీ అక్కడే పెట్టారు. వరల్డ్ బెస్ట్ షాపింగ్ సెంటర్స్ నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌ను అభివృద్ధి చేశారు. ఇలా అబ్బురంగా, అపురూపంగా స్వయంగా నిర్మించుకున్న దేశాలు…ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి బలైపోయాయి.
యుద్ధ పరిస్థితులను చూస్తే యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఎంత నష్టపోతున్నాయో గల్ఫ్ దేశాలు అంతకు మించి నష్ట పోతున్నాయి. క్యాపిటల్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2 శాతం వరకు క్షీణించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే, ఆర్థిక పరిస్థితులు క్షీణించి చమురు ఉత్పత్తి ఏకంగా 15 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఖతార్, కువైట్‌లపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎందుకంటే, అక్కడ పనిచేసే వారిలో చాలామంది విదేశీయులే ఉంటారు. యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది ఆయా దేశాల నుంచి స్వదేశాలకు చేరుకున్నారు. ఒకవేళ యద్ధం ఆగిపోయినా, అంత త్వరగా చమురు ఉత్పత్తి ప్రారంభించడం సులువైన పనికాదు. ఇరాన్ దాడివల్ల పలు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి కూడా. వాటి మరమ్మత్తులకు సమయం పట్టొచ్చు. ఆయా దేశాల్లో స్థానికంగా ఉండే మానవ వనరులు చాలా తక్కువ. అందులోనూ ఉద్రిక్తతల వల్ల విదేశీయులు అంత త్వరగా అక్కడికి రావడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో ఇప్పటికే చాలా దేశాలు గ్యాస్, చమురు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే పనిలో పడ్డాయి.
ఇప్పటిదాకా గల్ఫ్ దేశాలు ఆదాయ నష్టం గురించి బాధపడుతూ వచ్చాయి. తర్వాత ఆర్థికవ్యవస్థల పతనం గురించి ఆందోళన చెందాయి. కానీ మున్ముందు ప్రజల జీవనప్రమాణాలు కూడా దారుణంగా పతనమయ్యే సూచనలున్నాయి. అదే జరిగితే గల్ఫ్ మొత్తంగా పునర్నిర్మాణం చేసుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. అది జరగటం అంత తేలిక కాదు. మొత్తం మీద ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ ఆర్థికవ్యవస్థలు కుదేలయ్యాయి. ఆయా దేశాలన్నీ మళ్లీ ఆర్థికంగా పునర్జన్మ ఎత్తటానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న పాకిస్థాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టేసింది. పాక్‌లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇంధన సంక్షోభం తరుణంలో వినియోగాన్ని తగ్గించడం, పాఠశాలలను ఆన్‌లైన్‌కు మార్చడం వంటి పొదుపు చర్యలను ప్రవేశపెట్టింది పాక్. ఇప్పటికే పాక్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.500కు దాటిపోవడం.. ఆ దేశ ఇంధన భద్రతను పూర్తిగా ప్రమాదంలో పడేసింది. ఇప్పటికే ఆ దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా అడుగంటినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఆందోళనకర పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయనే గంభీర చర్చ మొదలైంది. ఒక వైపు అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితులు, మరోవైపు దేశంలో ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో రూపాయి విలువ పడిపోవడం, స్టాక్ మార్కెట్లలో అస్థిరత, కుదుపులు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా భారత ఆర్థిక పరిస్థితిపై ప్రభావవంతమైన ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భారత్ తటస్థ ధోరణి పాటిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మనం ఎంతసేపూ జీడీపీ గణాంకాలు చూసి చంకలు గుద్దుకుంటున్నామే కానీ.. ఇతరత్రా గణాంకాల్ని లైట్ తీస్కుంటున్నాం. జాగ్రత్తగా గమనిస్తే కొన్నేళ్లుగా మన బ్యాంకుల గణాంకాలు.. సామాన్యుల స్థితిగతులకు ఎంతోకొంత అద్దం పడుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపునిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అదే సమయంలో రుణాల్లో విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది. ఇక పారుబాకీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎగవేసిన క్రెడిట్ కార్డ్ బిల్లుల లెక్కలు చూస్తే.. ఇంటికో విజయ్ మాల్యా కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దేశంలో కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయనుకున్నారే కానీ.. అందులో నిజం లోతెంతో ఎవరూ చూడలేదు. అసలు జరుగుతున్న కొనుగోళ్లకు కూడా ఆధారం ఏంటో సరిగా అంచనా వేయలేదు. పర్యవసానంగా మన బ్యాంకులకు రావాల్సిన బాకీలు బాగా పెరిగిపోయాయి. గతంలోనూ బ్యాంకులకు రికవరీ కావాల్సిన రుణాలున్నా.. అవి ఎక్కువగా పరిశ్రమలు, సంస్థల రూపంలో ఉండేవి. కానీ ఇప్పుడు పెరిగిన రుణాల వృద్ధి మాత్రం వ్యక్తిగత విభాగంలో జరిగింది. ఇలాంటిది స్వతంత్ర భారత్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని పరిణామమని బ్యాంకర్లు కూడా చెబుతున్నారు.
మన దేశం విషయానికొస్తే.. ఆర్థిక వృద్ధి సంతోషపడేలా ఉంది కానీ.. ఉత్సవాలు చేసుకునేలా లేదనేది ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట. ఇక ఇరాన్ యుద్ధం.. ఈ పరిస్థితిని మరింత ప్రతికూలం చేసింది. మొదటే దేశంలో సామాన్యుల ఆదాయం బాగా తగ్గిపోయింది. దేశ పురోగతికి కీలకమైన సేవల రంగం.. ఇప్పుడు బిత్తరచూపులు చూస్తోంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయింది. దేశంలో 50 నుంచి 60 శాతం ఉద్యోగాలు సేవల రంగంలో ఉండటమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోయిన ఉద్యోగాలు పోగా.. ఉన్న ఉద్యోగాలు కూడా ఎంతకాలం ఉంటాయో తెలియని దుస్థితి ఉంది. ఉన్న ఉద్యోగాల్లో పేరుకి ఉన్న ఉద్యోగాలు, నిజంగా వేతనం వచ్చే ఉద్యోగాల్ని విడదీసి చూడాల్సినంతగా పరిస్థితులు దిగజారాయి. దేశంలో చాలా కుటుంబాలు పైన పటారం లోన లొటారం అన్నట్టుగా నెట్టుకొస్తున్నాయి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న చందంగా.. కన్నీళ్లను కడుపులోనే దిగమింగుకుంటున్నాయి.
దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న మాట నిజం. అంతమాత్రాన అందరికీ ఆదాయం లేదు. ఆదాయార్జనపరుల సంపాదన కూడా ఒకే రకంగా లేదు. దేశంలో 10 శాతం మంది దగ్గరే 90 శాతం సంపద పోగుపడిందని కొన్నేళ్లుగా ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. జీడీపీ పెరుగుతుందని సంబరపడితే చాలదు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అవుతుందా.. లేదా అనేది కూడా చూసుకోవాలి. ఆదాయ అసమానతలున్నచోట.. ఆర్థిక వృద్ధి బాగున్నా.. నిజవేతనాలు పెరగవు. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరగదు అని గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా ఆర్థికవేత్తల సూచనలు లైట్ తీస్కున్నవారికి కూడా.. ఇప్పుడు వారి సూచనల్లో కఠోర వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. ఎంతసేపూ దేశంలో ఇంత జనాభా ఉంది కాబట్టి.. ఇంత మొత్తంలో కొనుగోళ్లు జరుగుతాయని పేపర్ మీద లెక్కలేస్తున్నారు కానీ.. నిజంగా ఎంతమంది దగ్గర కొనుగోళ్లు పెరిగే స్థాయిలో ఖర్చుచేసే స్తోమత ఉందని అంచనా వేయడం లేదు. అక్కడే తేడా వస్తోంది.
ఇప్పటికే యుద్ధం కారణంగా మనకూ ఇంధన సమస్య వచ్చింది. ఇప్పటివరకూ ఎలాగోలా నెట్టుకొచ్చినా.. సుదీర్ఘ యుద్ధాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదని మన దేశ ఆర్థిక సంస్థలన్నీ మొత్తుకుంటున్నాయి. ఇప్పటికే గ్యాస్ సంక్షోభం వచ్చేసింది. ఇక అడపాదడపా పెట్రోల్ బంకుల దగ్గర క్యూలూ కనిపిస్తున్నాయి. ఎరువుల దిగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళన మొదలైంది. కొందరు ఆర్థికవేత్తలైతే ముందుంది మొసళ్ల పండగ అని హెచ్చరిస్తున్నారు. దీంతో భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలయ్యే పరిస్థితులు తీవ్రమౌతున్నాయని చెప్పక తప్పదు. ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటినీ దెబ్బ కొట్టడం ఖాయమైన తరుణంలో.. భవిష్యత్తులో మన దేశం కూడా వ్యూహం మార్చుకుని.. ఈయూతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్‌ను వాడుకుని.. యూరప్‌తో సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం అమెరికాను ఆర్థికంగా కుదేలు చేస్తోంది. గల్ఫ్ కూడా అమెరికా బాటలనే నడుస్తుంది. ఇక అప్పుడు ఎంతో కొంత మనకు ఆదరువుగా ఉండేది యూరప్ దేశాలే అనే అభిప్రాయాలున్నాయి. అంతిమంగా యుద్ధం తర్వాత మన దేశం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేది చూడాల్సి ఉంది.