Reading Time: < 1 minute

నాకు జోహోతో పని అయిపోయింది: ఆ సాఫ్ట్‌వేర్ లోపంతో భారీ నష్టం.. స్టార్టప్ ఓనర్ ఆవేదన

Caption of Image.

ప్రముఖ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ జోహో బుక్స్ (Zoho Books) వల్ల  భారీ నష్టం జరిగిందని ఒక స్టార్టప్ యజమాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జరిగిన తప్పుకు నష్టపరిహారం కోరుతూ ఆయన చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.

 సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే… ఫ్లెక్సీపీ (FlexiP) అనే కంపెనీ సహ-వ్యవస్థాపకుడు అజీమ్ హుస్సేన్ అతని  వ్యాపారానికి సంబంధించి జోహో బుక్స్‌ని వాడుతున్నారు. మార్చి నెల లెక్కలను ఒకసారి  స్వయంగా చెక్ చేయగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. దాదాపు రూ. 3.8 లక్షల విలువైన ట్రాన్సక్షన్స్ ఫైయిల్ అయినా జోహో బుక్స్ మాత్రం పేమెంట్లను సక్సెస్ అని  రికార్డుల్లో చూపించింది.

“డబ్బులు అకౌంట్లోకి రాలేదు, కానీ వచ్చినట్లు జోహో రికార్డ్ చేసింది. అది కూడా మాకు తెలియకుండా సైలెంటుగా జరిగిపోయింది. అసలు ఇలా ఎన్ని రోజులుగా జరుగుతుందో దేవుడికే తెలియాలి” అని హుస్సేన్ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఆవేదన చెందారు.

 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగేటప్పుడు ఇంత చిన్న సాఫ్ట్‌వేర్ తప్పును కనిపెట్టడం కష్టమని హుస్సేన్ అన్నారు. “జోహో లాంటి పెద్ద కంపెనీని నమ్మి వాడాము. ఇంత చిన్న విషయంలో తప్పు జరుగుతుందని అసలు ఊహించలేదు” అని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గత రెండేళ్ల లెక్కలను మళ్ళీ మొదటి నుండి ఆడిట్ చేయాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

చట్టపరమైన చర్యలు
జోహో కంపెనీపై అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నట్లు హుస్సేన్ తెలిపారు. జరిగిన ఆర్థిక నష్టంతో పాటు, దీనివల్ల కలిగిన మానసిక ఒత్తిడికి కూడా నష్టపరిహారం కోరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జోహో సమాధానం  
ఈ రచ్చపై జోహో కంపెనీ స్పందించింది. వారి ప్రాథమిక విశ్లేషణ ప్రకారం.. తప్పు జోహో సాఫ్ట్‌వేర్‌లో లేదని, పేమెంట్ గేట్‌వే  లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని తెలిపింది. సమస్యను పరిష్కరించడానికి తాము ఆ కంపెనీతో మాట్లాడుతున్నామని జోహో పేర్కొంది. పేమెంట్ గేట్‌వే కంపెనీ ‘క్యాష్‌ఫ్రీ’ కూడా దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.