
జాతీయ విద్యా విధానం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారన్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ చేస్తున్న వాదనలు కేవలం తన రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలని ఆయన విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. NEP 2020 వాస్తవానికి భాషా విముక్తికి ఒక ప్రకటన అని అన్నారు. ‘‘ఇది మాతృభాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి తమిళ బిడ్డ తమ సొంత గొప్ప భాషలో రాణించాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కానీ ఒక సరళమైన విధానాన్ని తప్పనిసరి హిందీగా తప్పుగా చిత్రీకరించడం ద్వారా మీరు తమిళాన్ని రక్షించడం లేదు, యువత అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారు’’ అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
ఎక్కువ భాషలు నేర్చుకోవడం ఒక ఆస్తి
అదనపు భాషలను నేర్చుకోవడం వల్ల తమిళం బలహీనపడదు, పైగా అది మాట్లాడే వారికి బహుభాషా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ధర్మేంద్ర స్పష్టం చేశారు. బహుభాషావాదాన్ని ఒక ముప్పుగా చిత్రీకరించడం సరికాదని, తమిళ విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలను దూరం చేయవద్దని స్టాలిన్‌కు సూచించారు.
PM శ్రీ స్కూళ్లు, నవోదయాలు ఏమయ్యాయి.?
తమిళనాడు ప్రభుత్వ తీరుపై ధర్మేంద్ర ప్రధాన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో PM శ్రీ పాఠశాలల ఏర్పాటుకు హామీ ఇచ్చినప్పటికీ, అవగాహన ఒప్పందంపై సంతకం చేయకుండా డీఎంకే ప్రభుత్వమే అడ్డుపడుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తమిళనాడులో నవోదయ విద్యాలయాలను స్థాపించకుండా అడ్డుకోవడం నిరుపేద విద్యార్థులకు చేస్తున్న ప్రత్యక్ష అన్యాయమని ఆయన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యా సమానత్వాన్ని బలిచేస్తున్నారని విమర్శించారు.
తమిళంపై ప్రధాని మోదీకి ఉన్న గౌరవం
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తమిళ భాషను జాతీయ సంపదగా కీర్తిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా తమిళ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లామని, కేంద్ర ప్రభుత్వం నిధులు, ఉపాధ్యాయ శిక్షణకు పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. కేవలం విభజనవాద ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.