
- ఇప్పటికే ట్రాఫిక్, మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా నియామకం
హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌జెండర్‌ర్లు సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వారికి కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని నిథమ్ లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్లను ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా నియమించారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మారుతి డ్రైవింగ్ స్కూల్ సహకారంతో డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి ఫొటోలు, వీడియోలు చిత్రీకరణతో పాటు వ్యవసాయంలో మందుల పిచికారీ, వివాహాలు ఇతర ఈవెంట్లలో ఉపాధి కల్పించనున్నారు. ప్రస్తుతం మొత్తం 91 మంది ట్రాన్స్జెండర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.17.72 లక్షలు ఖర్చు చేస్తున్నది.