Reading Time: 6 minutes

పిల్లలు తాగే పాల నుంచి వంట నూనె దాకా.. హైదరాబాద్లో సర్వం కల్తీ.. లైట్ తీసుకుంటే లైఫే రిస్క్లోకి..

Caption of Image.
  • టీ పొడి, అల్లంపేస్ట్​, పచ్చళ్లు, పన్నీర్​ వరకు..
  • కుళ్లిన చికెన్, మటన్ అంటగడ్తున్నరు​​.. అన్నింటా హానికారక కెమికల్స్
  • మార్కెట్​ నిండా కార్బైడ్‌‌‌‌తో మాగబెట్టిన పండ్లు.. కలర్​ కోసం తర్బూజకు ఇంజెక్షన్లు
  • రోజూ ఏదో చోట పట్టుకుంటున్నా మారని తీరు.. ఫుడ్​సేఫ్టీ వింగ్‌‌‌‌లో వెక్కిరిస్తున్న ఖాళీలు
  • తెలంగాణ, ఏపీకి కలిపి ఒక్కటే ల్యాబ్​ ఉండడంతో శాంపిల్​ టెస్టులు లేట్​
  • కల్తీ ఫుడ్​ అని తేలినా కఠిన శిక్షల్లేవ్​.. ఇదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు
  • కొనేముందు, తినే ముందు జాగ్రత్త!  అంటున్న నిపుణులు ​
  • లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు:పసి పిల్లలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్‌‌‌‌ పత్త దాకా.. కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా .. ఇలా ‘కాదేదీ కల్తీకనర్హం’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినే పచ్చడి, అందులో పోసుకునే నెయ్యి,  చిన్నారులు ఇష్టంగా తినే ఐస్​క్రీమ్స్, కిరాణా షాపుల్లో దొరికే తినుబండారాలు..  హోటళ్లలో తాగే చాయ్​, అందులో ముంచుకు తినే ఉస్మానియా బిస్కెట్స్.. ​ఇలా ఒక్కటేమిటి సర్వం కల్తీనే.. సీజనల్ ​ఫ్రూట్స్ ​సంగతీ సరే సరి! 

అరటి పండ్ల నుంచి మామిడి పండ్ల దాకా కార్బైడ్, ఇథనాల్ ​రైపనర్ ​పౌడర్​తో కృత్రిమంగా మాగబెట్టినవే. పైన నిగనిగలాడే వాటర్‌‌‌‌‌‌‌‌మెలన్‌‌‌‌ లోపల ఎరుపుదనానికి ఇంజెక్షన్లు ఇస్తున్న పరిస్థితి. ఏదైనా హాలీడే రోజు అలా రెస్టారెంట్‌‌‌‌కు వెళ్లి వెజ్జో, నాన్​వెజ్జో తిందామనుకున్నా భయమే! కుళ్లిన చికెన్, మటన్, పన్నీర్‌‌‌‌‌‌‌‌ను మసాలాలు దట్టించి వడ్డిస్తుండడంతో రోగాలు తప్పేలా లేవు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గ్లోబల్​ సిటీ హైదరాబాద్  కల్తీ ఫుడ్‌‌‌‌కు కేరాఫ్‌‌‌‌గా మారింది. ఫుడ్​సేఫ్టీ వింగ్​పటిష్టంగా లేకపోవడం, కల్తీ ఫుడ్​ అని తేలినా  కఠిన శిక్షల్లేకపోవడంతో కల్తీరాయుళ్లకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. కొనేముందు, తినే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జనం అల్సర్ల నుంచి క్యాన్సర్ల దాకా అనేక రోగాలబారిన పడ్తున్నారు. 

  • నిగనిగలాడేందుకు, నిల్వ ఉండేందుకు..

పాలు, పండ్లు, ఆహార సరుకులు నిగనిగలాడేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు, ఆహార పదార్థాల్లో రంగు, రుచి, వాసన కోసం హానికారక కెమికల్స్ కలిపి కల్తీ చేస్తున్నారు. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్​, కోవాలాంటివైతే కృత్రిమంగా తయారుచేస్తున్నారు. పాలపొడికి సుక్రోజ్‌‌‌‌, నూనె, యూరియా, సర్ఫ్‌‌‌‌, బేకింగ్‌‌‌‌ సోడా కలిపి పాలు తయారుచేస్తున్నారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు శవాలను భధ్రపరచడంలో వాడే హైడ్రోజన్‌‌‌‌ పెరాక్సైడ్‌‌‌‌తోపాటు ఫార్మాల్డిహైడ్‌‌‌‌ కలుపుతున్నారు.  ఇక లోకల్​గా దొరికే ఐస్​క్రీమ్స్‌‌‌‌లలో 90 శాతానికి పైగా కల్తీనే!  ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ తయారీలో ఇథైల్ ఎసిటేట్, బ్యూట్రాల్డిహైడ్, ఎమిల్ ఎసిటేట్, నైట్రేట్, వాషింగ్ పౌడర్ వాడుతున్నట్టు ఇటీవల ఫుడ్​ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 

ఐస్​క్రీమ్ టెక్స్చర్, టేస్ట్ పోకుండా ఉండడం కోసం అందులో ఒక రకమైన గమ్​ వాడుతున్నారు. కాస్త అల్లం, వెల్లుల్లికి సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పులాంటి రసాయనాలను కలిపి అల్లంవెల్లుల్లి పేస్ట్​తయారు చేస్తున్న అక్రమార్కులు,  ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు  సిట్రిక్ యాసిడ్  కలుపుతున్నారు.  పాలతో కాకుండా కెమికల్స్​తోనే  పన్నీర్, కోవా  తయారు చేస్తున్నారు.  ఇక పండ్ల విషయానికి వస్తే అరటిపండ్లు మగ్గేందుకు ఇథోపాన్ పెస్టిసైడ్, ఆపిల్‌‌‌‌పై పూతకు ప్యారాపిన్, సపోటా, దానిమ్మ, సంత్రాలను మగ్గించేందుకు కార్బైడ్ వినియోగిస్తున్నారు.  ఈ  కెమికల్స్​కారణంగా అలర్స్​ నుంచి క్యాన్సర్స్​ దాకా అనేక రోగాలు వస్తున్నాయని  డాక్టర్లు చెప్తున్నారు.  

  • కల్తీఫుడ్​లో ​హైదరాబాదే నంబర్ ​వన్​..

కల్తీఫుడ్‌‌‌‌లో ​హైదరాబాదే నంబర్​వన్‌‌‌‌గా ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి ఇదే పరిస్థితి. 1995 నుంచి -1999 మధ్య కాలంలో అధికారులు జరిపిన దాడుల్లో 4,455 ఆహార నమూనాలు కల్తీవని తేలాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 రిపోర్ట్స్​ప్రకారం దేశంలోని 19 ప్రధాన నగరాల్లో  ఆహార కల్తీలో హైదరాబాద్‌‌‌‌ మొదటి స్థానంలో నిలిచింది. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన 291 కేసుల్లో 246 కేసులు మన భాగ్యనగరంలోనే ఉన్నాయ్యాయంటే ఆశ్చర్యం కలగక మానదు.  2021 నుంచి 2024 సెప్టెంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన 15,702 శాంపిల్స్‌‌‌‌లో 2,387 (15 శాతం)  శాంపిల్స్​లో కల్తీ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పార్లమెంట్‌‌‌‌లో వెల్లడించింది.  

ప్రభుత్వం ప్రతి ఏటా శాంపిల్ టెస్టుల లక్ష్యాన్ని పెంచుతున్నా, కల్తీ శాతం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఫిర్యాదులు పెరుగుతుండడంతో ఇటీవల సిటీలో  నెలక్రితం  టాస్క్​ఫోర్స్​, ఫుడ్​సేఫ్టీ, జీహెచ్‌‌‌‌ఎంసీ డిపార్ట్‌‌‌‌మెంట్లతో కలిపి హెచ్ ఫాస్ట్ (హైదరాబాద్​ఫుడ్​అడల్ట్రేషన్​సర్వైలైన్స్​టీమ్​) ఏర్పాటు చేశారు. ఈ టీమ్​ గత నెల 19 నుంచి సిటీలోని పలుచోట్ల తనిఖీలు చేసి 62వేల  టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేసింది. 92 కేసులు నమోదు చేసి, 98 మంది కల్తీరాయుళ్లను కటకటాల్లోకి నెట్టింది. కాగా, హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికే పరిమితం కావడంతో  రాష్ట్రం నలుమూలల నుంచి కాల్స్​ వస్తున్నా స్పందించలేని పరిస్థితి. దీంతో జిల్లాకేంద్రాల్లోనూ ఇలాంటి సంస్థలు ఏర్పాటుచేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.  

  • ఇటీవలి దాడుల్లో టన్నుల కొద్దీ కల్తీ సరుకులు.. 

 హైదరాబాద్‌‌‌‌లో హెచ్​ఫాస్ట్, ​అంతకుముందు టాస్క్​ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో ఏకంగా 62వేల కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్​పట్టుబడింది. ఆ తర్వాతి స్థానంలో కుళ్లిన మటన్​, చికెన్​ఎక్కువగా ఉంటోంది. ఇటీవల  ఏకంగా 17 టన్నుల వరకు దొరికింది. ఇతర రాష్ట్రాల నుంచి చచ్చిన మేక, గొర్రె మాంసాన్ని తెచ్చి నెలల తరబడి ఫ్రీజర్లు, కోల్డ్​స్టోరేజీల్లో పెట్టి విక్రయించడం పరిపాటిగా మారింది. నార్త్​ఇండియాలో ఎక్కువగా తినని బోటి, కార్జంను ఇక్కడికి దిగుమతి చేసుకొని  హోల్‌‌‌‌సేల్‌‌‌‌గా రెస్టారెంట్లు, ఫాస్ట్​ఫుడ్​సెంటర్లు, బార్​అండ్​రెస్టారెంట్లు, వైన్స్‌‌‌‌లోని సిట్టింగ్​సెంటర్లకు  సప్లై చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 

నెలల తరబడి డ్రమ్ముల్లో నిల్వ ఉంచి, అపరిశుభ్రంగా తయారు చేస్తున్న ఊరగాయ 9 టన్నులు, నాసిరకం మిల్క్​ప్రొడక్ట్స్‌‌‌‌తో తయారు చేసిన కోవా 5 టన్నులు, పన్నీర్​4.5 టన్నులు దొరికాయి. దుమ్ము, రంగు మారి, నాసిరకం ఆకులతో తయారు చేసిన టీపొడి 2 టన్నులు, పిండి కలిపి రెడీ చేసిన పెరుగు 2.5 టన్నులు, నాసిరకం నూనెలు, పాడైన ఆహార పదార్థాలతో (పాడైన ఆలుగడ్డలు, అరటి పండ్లు) తయారు చేసిన చిప్స్, క్యాండి 100 కిలోలు, నెయ్యి, నాసిరకం నూనె, క్రీమ్స్​3,790 కిలోలు పట్టుబడ్డాయి. వట్టినాగులపల్లిలో స్థిరపడిన భన్వర్ రామ్ జాట్, అతని కుమారుడు అశోక్ కుమార్  స్థానికంగా శ్రీ జస్నాత్ ట్రేడర్స్ దుకాణం నిర్వహిస్తున్నారు.  

గడువు ముగిసిన వంట నూనెలను సేకరించి, వాటిని రకరకాల ఆయిల్స్‌‌‌‌తో కలిపి విక్రయిస్తున్నారు. ఈ నూనెను మార్కెట్లో ఉన్న ప్రముఖ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో పాటు గడువు తీరిన గోధుమ పిండిని పలు ప్రాంతాల నుంచి సేకరించి, అదే పిండిని జన్నాత్ గోల్డ్ చక్కీ అటా పేరుతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.  మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో  5,026 లీటర్ల కల్తీ నూనె,  5,192 కిలోల గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు.  గోల్నాకలో ఓ వ్యక్తి కుళ్లినగుడ్లతో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు ఇటీవల గుర్తించి యజమానిని అరెస్ట్ చేశారు. 

  • పండ్లు కాదు.. విషం.. 

ఫుడ్డే కాదు పండ్లను కూడా విషంగా మారుస్తున్నారు. ఈ సీజన్‌‌‌‌లో ఎక్కువగా దొరికే మామిడి పండ్లను సహజ పద్ధతిలో కాకుండా కాల్షియం కార్బైడ్‌‌‌‌తో, ఇథలీన్​రిఫైనర్‌‌‌‌‌‌‌‌తో కృత్రిమంగా పండేలా చేసి అమ్ముతున్నారు. ఇలా మాగబెట్టడాన్ని ఇప్పటికే హైకోర్టు నిషేధించింది. అయినా, చాలా చోట్ల ఈ దందా జరుగుతూనే ఉంది. 

వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా ఆపడం లేదు. గత నెల మార్చి 27న బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి మామిడి కాయలను కొని హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌లోని గోదాంలో నిల్వ ఉంచి ఇథినాల్​రిఫైనర్​ పౌడర్ ఉపయోగించి మామిడి పండ్లను పక్వానికి తెస్తుండగా.. రెయిడ్స్​ చేసి 684 కిలోల మామిడి పండ్లు, 211 ఇథనాల్​రిఫైనర్​పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  శుక్రవారం ఆసిఫ్‌‌‌‌నగర్‌‌‌‌లో ఫ్రూట్ గోదాంపై హెచ్ ఫాస్ట్ దాడులు చేసి 7 టన్నుల పండ్లను పట్టుకున్నారు. దీనిపై శుక్రవారం హైదరాబాద్​సీపీ వీసీ సజ్జానార్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. 

నోరూరించే మామిడి మాటున ప్రాణాంతకమైన విషకోరలు దాగున్నాయని..మార్కెట్లలో ఎక్కడైనా మామిడిని కార్బైడ్​తో మాగబెడితే 100 నంబర్‌‌‌‌‌‌‌‌కు గానీ, హెచ్-ఫాస్ట్  ఫోన్ నంబ‌‌‌‌ర్ 8712661212కుగానీ కాల్ చేయాలని కోరారు.  అలాగే పుచ్చకాయలు త్వరగా పండటానికి, ఎర్రగా కనిపించడానికి ఎరిత్రోసిన్ , కార్బైడ్  పౌడర్‌‌‌‌‌‌‌‌లాంటి వాటిని, తీపి కోసం చక్కెర ద్రావణాలు, నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్  ఇంజెక్ట్​చేస్తున్నట్టు గుర్తించారు. పుచ్చకాయను కోసి టిష్యూ పేపర్‌‌‌‌‌‌‌‌తో తుడిస్తే దానికి కలర్ అంటుంకుంటే ఇంజెక్షన్లు ఇచ్చినట్టేనని, లేదంటే మంచిదని ఎక్స్‌‌‌‌పర్ట్స్​చెప్తున్నారు. 
ఫుడ్ ​సేఫ్టీలో అరకొర సిబ్బంది..  

  • శాంపిల్స్​ ఇచ్చినా రిపోర్టులు లేట్​..

రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూల్స్ ప్రకారం ప్రతి 500 నుంచి 700 ఫుడ్  బిజినెస్ ఆపరేటర్లకు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షకు పైగా రిజిస్టర్డ్ హోటళ్లు, తయారీ కేంద్రాలు ఉండటంతో కనీసం 250 నుంచి 300 మంది అధికారులు అవసరం. కానీ, ప్రస్తుతం కేవలం 75 మందిలోపే విధుల్లో ఉన్నారు.  ఇక జిల్లా స్థాయిలో లైసెన్సులను పర్యవేక్షించే డెసిగ్నేటెడ్ ఆఫీసర్లు (డీఓ) 10 జిల్లాలకే రెగ్యూలర్‌‌‌‌‌‌‌‌గా ఉండి మిగతా జిల్లాలకు అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నారు. ఒకే అధికారి రెండు మూడు జిల్లాలను పర్యవేక్షించాల్సి రావడంతో తనిఖీలపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ మూడు కార్పొరేషన్లలో కలిపి 17 మంది  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఐదుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. 

వీరు మూడు కార్పొరేషన్లలో ని 60 సర్కిల్స్ కవర్ చేయాల్సి ఉంది. కొందరికి ఒక కార్పొరేషన్ రెండు సర్కిల్స్, మరో కార్పొరేషన్ లో రెండు సర్కిల్స్ బాధ్యతలు ఇచ్చారు. ఇటీవల ఏర్పడిన హెచ్ ఫాస్ట్  విభాగంలో ఇన్‌‌‌‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌‌‌‌స్పెక్టర్లు ఇతర సిబ్బందితో కలిసి మొత్తం 28 మంది ఉన్నారు. ఈ సంఖ్య 3 కార్పొరేషన్లలోని ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం.  మరోవైపు స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మూడేండ్లలో14,500 శాంపిల్స్ సేకరించగా, ఇందులో 800 మందికి జరిమానాలు విధించడంతోపాటు కొందరిపై మాత్రమే సివిల్ కేసులు నమోదు చేశారు. 

వీటిలో సగానికిపైగా నగరానికి చెందినవే ఉన్నాయి. వీరితోపాటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అడపాదడపా రెయిడ్స్‌‌‌‌ జరుపుతూనే ఉన్నారు. అయితే, శాంపిల్స్​సేకరించి ల్యాబ్​కు పంపుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. తెలంగాణ, ఏపీలకు కలిపి నాచారంలో ఒకే ఒక స్టేట్ ల్యాబ్ ఉండటంతో రిపోర్టులు రావడానికి ఆలస్యమవుతున్నది. రూల్స్​ప్రకారం…కల్తీ అని తేలితే 14 రోజుల్లో నివేదిక రావాలి. శాంపిల్స్ క్వాంటిటీ సరిగ్గా లేకపోవడం, 2, 3 రోజులు దాటిన తర్వాత ల్యాబ్‌‌‌‌కు శ్యాంపిల్ చేరితే రిజెక్ట్ అవుతున్నాయి. 

  • అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ కోసం వాకథాన్..

99 రోజుల యాక్షన్ ప్లాన్‌‌‌‌లో  భాగంగా సోమవారం  ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్టేట్ ఫుడ్ సేఫ్టీ డే , జీహెచ్‌‌‌‌ఎంసీ కలిసి సోమవారం ఉదయం 1200 మందితో  జలవిహార్ నుంచి వాకథాన్ నిర్వహించి ఫుడ్ సేఫ్టీ పట్ల అవగాహన కల్పించనున్నారు. అనంతరం  ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ వాడితే హైజీన్ అనేది నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌‌‌లో ప్రదర్శించనున్నారు. 

  • బ్రాండెడ్ వాడటమే బెస్ట్…

కాస్త ధర ఎక్కువైనా బ్రాండెడ్​వస్తువులు వాడాలి. అవి కూడా ప్యాకేజీ లీక్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ బ్రాండెడ్​లోనూ ఏదైనా సమస్య ఏర్పడితే  040–21111111 నెంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయాలి. కల్తీ ఫుడ్ పట్ల అందరం కలిసి పోరాడాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్​–2006 ప్రకారం ప్రతి ఫుడ్ ప్రొడక్ట్‌‌‌‌కు ఫుడ్​ సేఫ్టీ సర్టిఫికెట్​ ఉండాలి. దాన్నే ఎఫ్​ఎస్​ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ అంటారు.  వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్స్​ నడిపేవాళ్లు.. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్లంతా ఈ లైసెన్స్​ తీసుకోవాల్సిందే. వాళ్ల ఫుడ్ ప్రొడక్ట్​ పైన14 అంకెల లైసెన్స్​ నెంబర్ ప్రింట్ ఉండాలి. అప్పుడే వాళ్లకు బిజినెస్ చేసుకునేందుకు అర్హత ఉన్నట్టు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే సమయంలో దీన్ని గమనించవచ్చు. ఏదీ కల్తీ అనేది ఎలా గుర్తించాలనేది ఎఫ్ఎస్ఎస్ఏఐ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉంటుంది. దాన్ని ఫాలో అవండి. కూరగాయలు, ఫ్రూట్స్‌‌‌‌ను ఉప్పు నీళ్లు, తినే సోడాతో కడిగి వాడాలి. దీనివల్ల ఏమైనా కెమికిల్స్ ఉంటే పోతాయి.  – పీ మూర్తిరాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ట్రై కార్పొరేషన్స్  

కల్తీ ఫుడ్​ నుంచి కాపాడుకోవాలంటే.. 

  •   లేబుల్​లేని విడి ప్యాకెట్లలో దొరికే  కారం, పసుపు, గోధుమపిండి, టీ పౌడర్​ లాంటివి  కొనవద్దు. 
  •   బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్​ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. అల్లం, వెల్లుల్లి కొని ఇంట్లోనే పేస్ట్ చేసుకోవడం మంచిది. 
  •   సిటీల్లో విడిగా దొరికే పాలు, పెరుగు, నూనెలు వాడవద్దు.
  •   ధర ఎక్కువైనా బ్రాండెడ్​ ఉత్పత్తులే మేలు.
  •   అన్​బ్రాండెడ్​ వాటర్​ బాటిళ్ల నీరు తాగవద్దు.
  •   కిరాణా షాపుల్లోని ప్లాస్టిక్​ డబ్బాల్లో ఉంచి అమ్మే తినుబండారాల జోలికి వెళ్లవద్దు.
  •   స్ట్రీట్​ఫుడ్​ పూర్తిగా మానేయాలి. రెస్టారెంట్లలో తినడాన్ని తగ్గించాలి.
  •   తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఫుడ్​ తినాల్సి వస్తే వెజ్​ వంటకాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
  •   సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వండుకొని తినాలి. 

  నమ్మకస్తుల వద్దే మటన్, చికెన్​ కొనాలి. వేలాడదీసిన యాట​నుంచే మటన్​ కట్​ చేయించుకోవాలి. కింది నుంచి వేసేది తీసుకోకూడదు. 
  అన్​సీజన్​లో వచ్చే పండ్లు అస్సలు తినవద్దు. ఉదాహరణకు మామిడిపండ్ల సీజన్​ ఏప్రిల్​లో మొదలవుతుంది. అందువల్ల ఫిబ్రవరి, మార్చిలో వచ్చే మామిడిపండ్లు తినవద్దు. పసుపుపచ్చగా ఉండే అరటిపండ్లకు బదులు కాస్త మచ్చలు ఉన్నవాటిని తినడం మంచిదని ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు. 

  • హత్యతో సమానం…

మద్యం, సిగరెట్లులాంటి అలవాట్లు లేని యువత కూడా ఈ మధ్య ఎర్లీ ఏజ్ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మనం తింటున్న ఆహారం విషతుల్యం కావడమే. హోటళ్లలో కుళ్లిన మాంసానికి వాసన రాకుండా అధిక వేడితో రోస్ట్ చేస్తున్నారు, కానీ, ఆ మాంసంలో బ్యాక్టీరియా విడుదల చేసే ట్యాక్సిన్లు అలాగే ఉండి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వ్యవస్థను నాశనం చేస్తాయి. ముఖ్యంగా స్మోక్డ్ మీట్ వాడకం హైలీ క్యాన్సర్ కారకంగా మారుతున్నది. కల్తీ ఆహారం తిన్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి, లూజ్ మోషన్స్‌‌‌‌ అవుతాయి. కిడ్నీ సమస్యలు, కాన్సర్ కూడా వస్తుంది. పండ్లలో నిగనిగలాడే వ్యాక్స్, రంగు కోసం వాడే కెమికల్స్, చివరకు పాలలో కలుపుతున్న యూరియా వల్ల శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటున్నాయి. ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల బాధితులుగా మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. 
– డాక్టర్ మధుసూదన్, హెచ్‌‌‌‌వోడీ, 
గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఉస్మానియా హాస్పిటల్

©️ VIL Media Pvt Ltd.