
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ భూములను రక్షిస్తే, రేవంత్ ప్రభుత్వం వాటిని భక్షిస్తోందని ఫైరయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున రూ.7 వేల కోట్ల రూపాయల భూస్కాంకు తెరలేపారని.. దళితులు, బలహీన వర్గాల భూములు గద్దల్లా తన్నుకుపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
“కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలు పెట్టాడు. నాదర్ గుల్ భూముల్లో పొంగులేటి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు. హైదరాబాద్‌లోని లచ్చమ్మ కుంటను బడాబాబులు కబ్జా చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కళ్ళు మూసుకున్నాడు. ఆ చెరువు కబ్జా దగ్గరికి నువ్వు పోతావా? మేము పోయి చూపించాలా?. పేదోళ్లను మాత్రమే అరెస్టులు చేస్తారా?.. బడాబాబులను అరెస్ట్ చేయడానికి రంగనాథ్‌కు చేతకావడం లేదా?” అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.