
టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోగా, మహ్మద్ షమీ తన అమోఘమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను వణికించాడు. మొదటి ఓవర్ లోనే అభిషేక్ శర్మను సున్నా పరుగులకే అవుట్ చేసిన షమీ, మూడో ఓవర్ లో ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్ ను కూడా పెవిలియన్ కు పంపాడు. తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసిన షమీ, కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇది సన్‌రైజర్స్‌పై ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పొదుపైన బౌలింగ్ గణాంకాల్లో ఒకటిగా నిలిచింది.
అంపైర్లతో వివాదం: అసలు కారణం ఇదే..!
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో అసలు వివాదం మొదలైంది. షమీ తన నాలుగు ఓవర్ల బౌలింగ్‌ను ముగించి విశ్రాంతి కోసం మైదానం వెలుపలికి వెళ్తుండగా, అతని స్థానంలో మాథ్యూ బ్రీట్జ్కే ఫీల్డింగ్‌కు వచ్చాడు. అయితే, ఈ మార్పును అంపైర్లు అడ్డుకున్నారు. షమీని తిరిగి మైదానంలోకి రావాలని ఆదేశించడంతో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ దగ్గరకు వెళ్లి చాలా ఆవేశంగా చర్చించడం కనిపించింది. పంత్ ప్రవర్తన, మాట తీరు అంపైర్లను అసహనానికి గురిచేసింది.
— crictalk (@crictalk7) April 5, 2026
ఐపీఎల్ నిబంధనలు, నిషేధం ముప్పు..
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం, మైదానంలో అంపైర్లతో లేదా ఇతర ఆటగాళ్లతో అసభ్య పదజాలం వాడటం లేదా అమర్యాదగా ప్రవర్తించడం లెవల్-1 నేరం కిందకు వస్తుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీ ఈ ఘటనను సమీక్షిస్తారు. ఒకవేళ పంత్ లేదా షమీ అంపైర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేలితే, వారికి మ్యాచ్ ఫీజులో కోత విధించడమే కాకుండా, ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది.
పుంజుకున్న సన్‌రైజర్స్ ఇన్నింగ్స్..
ఒకవైపు వివాదం నడుస్తున్నప్పటికీ, సన్‌రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతంగా ఆడారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. 20 ఓవర్లు ముగిసే సమయానికి సన్‌రైజర్స్ 156 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేసింది. మైదానంలో జరిగిన ఈ ఘర్షణ లక్నో జట్టు ఏకాగ్రతను దెబ్బతీస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..