
రక్షణ ఆపరేషన్‌లో అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసం
అవశేషాల ఫోటో విడుదల చేసిన ఇరాన్
వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధవిమాన పైలట్‌ను రక్షించే ఆపరేషన్‌లో భాగంగా అమెరికా తన యుద్ధవిమానాలను తానే స్వయంగా ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన అవశేషాల చిత్రాన్ని ఇరాన్ విడుదల చేయగా, అమెరికాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఒక అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ రక్షణ చర్యలో రెండు ఎంసీ-130జె రవాణా విమానాలు పాల్గొన్నాయి. శత్రు ప్రాంతాల్లో రహస్యంగా ప్రవేశించి, సిబ్బందిని బయటకు తీసుకురావడానికి ఉపయోగించే ఈ విమానాలు ఆపరేషన్ సమయంలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో అవి ఇరాన్ చేతుల్లో పడకుండా ఉండేందుకు అమెరికా బలగాలు వాటిని పేల్చివేశాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, ఈ ఘటనపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ధ్వంసమైన విమానాల అవశేషాల ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలాంటి విజయాలు ఇంకొన్ని సాధిస్తే అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది అని వ్యాఖ్యానించారు.
ఇక ఇరాన్ వైమానిక రక్షణ దళాలు కూల్చివేసిన ఎఫ్-15ఇ యుద్ధవిమానంలో ఉన్న ఇద్దరు సిబ్బందిలో ఒకరిని ముందుగానే రక్షించగా, మిగిలిన పైలట్‌ను రాత్రి జరిగిన సాహసోపేత ఆపరేషన్‌లో అమెరికా సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను ప్రశంసిస్తూ, మా సైన్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ రక్షణ చర్యను విజయవంతంగా పూర్తి చేసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని పేర్కొన్నారు. వి గాట్ హిమ్! అంటూ ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో జరిగిన ఈ రక్షణ చర్యను ట్రంప్ చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. గాయాలపాలైన పైలట్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. ఇక ఇజ్రాయెల్ కూడా ఈ ఆపరేషన్‌కు మద్దతుగా రహస్య సమాచారాన్ని అందించిందని సమాచారం. ఆ ప్రాంతంలో తమ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి సహకరించినట్లు వెల్లడైంది. మరోవైపు ఈ ఆపరేషన్ సమయంలో అమెరికాకు మరింత నష్టం జరిగిందని ఇరాన్ పేర్కొంది. ఒక సీ-130 రవాణా విమానం, రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు సహా పలు యుద్ధ వాహనాలను ధ్వంసం చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో కనీసం ఏడు అమెరికా యుద్ధవిమానాలను కూల్చేశారని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. తాజా ఆరోపణలు నిజమైతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.