
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసుకునే చర్యలు గత వారం ఒక కొలిక్కి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఐదు గంటలకు పైగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించడం, అక్కడ లోకసభలో, రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందడం, ఇక రేపోమాపో రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే చట్టం అయిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ తీర్మానం మీద శాసనసభలో చర్చ జరిగిందనడంకంటే అమరావతి అవసరాన్ని గురించి మాట్లాడుకున్నారని, ఆ మాట్లాడుకున్న విషయాన్ని పార్లమెంటుకు పంపించారని చెప్పుకోవచ్చు. సాంకేతికంగా అమరావతి మీద శాసనసభ ఒక్కటే తీర్మానం చేసినా చెల్లుతుంది. కానీ శాసనమండలికి ఆ తీర్మానాన్ని పంపించి అక్కడ కూడా ఆమోదం పొందకపోవడం పెద్దల సభను అవమానించడమే. బహుశా అక్కడ ప్రతిపక్ష సభ్యులు ఎక్కువమంది ఉన్నారు కాబట్టి అభ్యంతరాలు వస్తాయని, చర్చ జరుగుతుందని అధికారపక్షం ఈ ఆలోచన చేసి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో సంభాషణ, మరీ ముఖ్యంగా భిన్నాభిప్రాయాల మధ్య సంఘర్షణ చాలా ఆరోగ్యకరమైనది. కానీ అటువంటి ఆరోగ్యకరమైన సంప్రదాయాల్ని రోజురోజుకీ ప్రభుత్వాలు వదిలేస్తున్న విషయం తెలిసిందే.
ఏదైతేనేం, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని నిర్ధారించి త్వరలోనే ఆ ప్రాంతానికి కేంద్ర తపాలా శాఖ ఒక పిన్ కోడ్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు రాగానే కూటమి సంబరాలు మిన్నంటాయి. సహజంగానే దేశానికి ఒక రాజధాని ఉన్నట్టే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అప్పుడెప్పుడో విడిపోయిన రాష్ట్రాల విషయం ఏమో కానీ రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన మూడు రాష్ట్రాల విషయం తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గఢ్ విడిపోయినప్పుడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి వివాదం కానీ, కేంద్ర జోక్యం కానీ అవసరం లేకపోయింది. డెహ్రాడూన్, రాంచి, రాయపూర్ నగరాలను రాజధానులుగా చేసుకుని ఆయా ప్రభుత్వాలు వాటి పనుల్లో పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విడిపోయిన రాష్ట్రం తెలంగాణ కాకుండా మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. రాజధాని ఏర్పాటు కోసం కొన్ని నగరాలు ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిననాటి నుండి, మళ్లీ మాట్లాడితే రాష్ట్రం ఏర్పాటుకు ముందునుండి వేరు తెలంగాణనే కోరుతూ ఇన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా విభజన ముమ్మాటికీ జరగదన్న ధీమాతో హైదరాబాద్ వైపు చూస్తూ ఉండిపోయిన కారణంగానే ఆంధ్రప్రదేశ్ కు ఈ తప్పనిసరి ఇబ్బంది ఎదురైంది.
పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాన్ని రాజధాని అంటారు. దానితోపాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేయగలిగిన అనుకూల ప్రాంతం అయితే మరీ మంచిది. పరిపాలన సౌలభ్యం అంటే శాసనసభ సముదాయం, హైకోర్టు, రాజభవన్, సచివాలయం, మంత్రులు, అధికారులు, సిబ్బంది నివాస గృహ సముదాయాలు వంటివి సమకూర్చుకోగలిగితే ఆ సముదాయాల చుట్టూ నగరం విస్తరించడం సహజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన అమరావతి బృహత్ కార్యక్రమం ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నారు? ఒక రాజధాని కావాలా లేక ప్రపంచమంతా కన్నార్పకుండా చూసే ఒక మహానగరం కావాలా? మొదటిది అయితే ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఏర్పడి ఉన్నది. ఇక రెండవది అయితే ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఆయన తరచూ చెప్పే విజన్ 20 47 నాటికి కూడా సాధ్యపడుతుందని చెప్పలేం. మరి దేనికోసం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబునాయుడు, ఆయన కూటమి పార్టీలు ఖర్చు చేయదలుచుకున్నాయి? రాష్ట్రం విడిపోయిన 12 సంవత్సరాలకు ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించుకోవాలన్న ఆలోచన అక్కడి కూటమి ప్రభుత్వానికి రావడానికి కారణాలేమిటి?
2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక 29 గ్రామాల రైతుల నుండి సేకరించిన 30 వేల పైచిలుకు ఎకరాల భూమితోబాటు దాదాపు 20వేల ఎకరాల ప్రభుత్వభూమి కలిపి 50 వేల ఎకరాల్లో లక్ష కోట్లో రెండు లక్షల కోట్లో ఖర్చుపెట్టి ఒక మహా నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన.. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అమలుకు నోచుకోకుండా పోయింది. లోటుబడ్జెట్ తో విడిపోయిన రాష్ట్రం, అప్పులతో సతమతమవుతున్న రాష్ట్రం రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు వ్యయం చేయడం తప్పు అన్నది వైఎస్సార్సీపీ వాదన. ఆ పార్టీ అధికారంలో ఉండగా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. చట్టపరమైన సమస్యలు, ఇతర సమస్యల కారణంగా అది అమల్లోకి రాకముందే ఆ పార్టీ పరాజయం పాలైంది. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మూడు పార్టీల కూటమి ఎజెండాలో మళ్లీ అమరావతి రాజధాని చేరింది.
విజన్ 2047 అని చంద్రబాబు, మరో 15 ఏళ్లు బాబే ముఖ్యమంత్రి అని కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటించుకోవడం చూశాం. అంత విశ్వాసం ఉన్నప్పుడు మామూలుగా రాజధానిని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. చట్టబద్ధత ఎందుకు అవసరం అయింది? మళ్లీ అధికారంలోకి రామేమోనన్న భయం కూటమికి పట్టుకున్నందువల్లనే అమరావతిని మళ్లీ ఎవరొచ్చినా మార్చకుండా ఉండేందుకు ఈ చర్య అన్న చర్చ జరుగుతున్నది. భారత రాజ్యాంగాన్ని మించినది మన దేశానికి ఇంకోటి లేదుకదా. దానినే కొన్ని వందలసార్లు ఈ దేశ అవసరాలకు అనుగుణంగా సవరించుకున్నాం. రేపు ఒకవేళ కూటమి ఆందోళన చెందుతున్నట్టుగానే, 2029లో వైయస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ శాసనసభలో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి పార్లమెంట్ చేత దాన్ని చట్టం చేయించుకోవడం సాధ్యం కాని పని ఏమీ కాదు కదా. అప్పటికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో? ఒకవేళ బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏనే తిరిగి అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ అవసరం దానికి కలగకుండా ఉంటుందని ఎందుకు అనుకోవాలి?
అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకోవడం, సాధ్యాసాధ్యాల మీద సమాజంలోని భిన్నవర్గాల ముందు చర్చ పెట్టడం, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావడం అనే ప్రజాస్వామిక పద్ధతి అమరావతి విషయంలో కనిపించదు. అమరావతి విషయంలో ఎవరు కొంచెం విమర్శనాత్మకంగా వ్యవహరించినా వాళ్లను ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా చిత్రించేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. ఇదే కూటమిలోని జనసేన, బిజెపి గతంలో అమరావతి రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 50 వేల ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోబోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇంచుమించు ఇదేతరహాలో బిజెపి నాయకురాలు పురందేశ్వరి గతంలో విమర్శించారు. ఎవరు ఏమనుకున్నా అమరావతిలో రాజధానిని శాశ్వతం చేయాలన్న చంద్రబాబునాయుడు కోరిక ప్రస్తుతానికైతే తీరింది.
అయితే ప్రతిపక్షాలు.. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్న అభ్యంతరాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడుకో, పార్టీగా తెలుగుదేశానికో లేకపోయినా ప్రభుత్వంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గం తప్పనిసరిగా ఈ అభ్యంతరాల పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకపక్క కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే కేంద్రం నుండి నిధులు, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థలనుంచి నిధులు అప్పుగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అప్పులభారంతో కుంగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనంగా అమరావతి అప్పును ఎలా భరించాలి? అక్కడ నిర్మాణాలకోసం చేస్తున్న వ్యయంలో తీవ్రమైన అవినీతి జరుగుతున్నదనే ఆరోపణకు వివరణ ఏది? దాదాపు పదేళ్లు గడిచిపోయినా ఇప్పటికింకా స్వచ్ఛందంగా లేదా తప్పనిసరి అయి భూములు ఇచ్చిన రైతులకు లబ్ధి చేకూరేది ఎప్పుడు?
ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజానీకాన్ని సమాధాన పరచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబునాయుడు మీద తప్పనిసరిగా ఉంటుంది. ఢిల్లీలో నూతన పార్లమెంట్ సెంట్రల్ విస్తా నిర్మాణవ్యయం ఒక చదరపు అడుగు ఐదునుండి పదివేల రూపాయలలోపే ఉండగా అమరావతిలో నిర్మాణాలకు చదరపు అడుగుకు 14 వేల రూపాయల చొప్పున ఖర్చు చేయడాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లకు సమాధానం చెప్పాలి కదా. రాజధాని ప్రాంతాన్ని నిర్ధారించే ముందు దాని చుట్టుపక్కల భూములు రైతులనుండి ఏలినవారికి దగ్గరివాళ్ళు తక్కువ ధరలకు కొనుగోలు చేశారని, దీన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారని లోకసభ సాక్షిగా గత వారం చర్చలో వైఎస్‌ఆర్ సీపీ పక్షనేత మిథున్ రెడ్డి మరోసారి చేసిన ఆరోపణ మీద నిగ్గు తేల్చాలి కదా.
ఇవన్నీ ఎలా ఉన్నా కూటమి నేతలు చెపుతున్నట్టు ఐదుకోట్ల మంది ఆంధ్రులు హారతులు పడుతూ ఉంటే, దేశమంతా జేజేలు పలుకుతుంటే అమరావతి నిర్మాణానికి చట్టబద్ధత కోసం ఎక్కడా లేని విధంగా ఇంత ప్రయాస ఎందుకు? పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్న ప్రశ్నలు మాత్రం పెద్దయెత్తున చర్చలోకి వచ్చాయి. సరే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుగా అమరావతి హైదరాబాద్ ప్లస్ అవుతుందో, భవిష్య నగరంగా (ఫ్యూచర్ సిటీ) భాసిల్లుతుందో ముందు ముందు తెలుస్తుంది.ప్రఖ్యాత ఉర్దూ సాహిత్యకారుడు సాహిర్ లుధియాన్వి ఒక సినిమా కోసం రాసిన ప్రేమ గీతంలోని ఒక చరణం ‘తసవ్వుర్ మే కోయి బస్తా నహి హమ్ క్యా కరే‘ అని ఉంటుంది. అంటే, ‘ఊహల్లో ఎవరూ నివసించలేరు, ఏం చేస్తాం’ అని అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి జరుగుతున్న వ్యవహారమంతా ఈ చరణాన్ని గుర్తు చేస్తున్నది. పార్లమెంటులో నిర్ణయం జరిగిపోయిందన్న ఆనందంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ‘తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్’ అన్నారు. బ్రెయిన్ చైల్ అంటే ఆయన ఆలోచనలోంచి పుట్టిందని అర్థం.
తెలంగాణ ఆయన ఆలోచనల నుంచి ఎలా పుట్టిందో ఆయనే వివరించాలి. అది దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల చరిత్ర అని ఆయనకు తెలియదు. చరిత్ర చదివే అలవాటేలేని రాజకీయవేత్త చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్ర చదవడం శుద్ధదండగ అన్న మహానుభావుడు. 1978కి ముందువరకు ఆయనకు హైదరాబాద్ అంటే తెలిసి ఉండదు. ఆయన ఎంతసేపూ హైదరాబాద్ నగరం 1982లో తన మామగారు తెలుగుదేశం పార్టీ పెట్టాకనే పుట్టిందని అనుకుంటారు. అంతేకాదు, 2010 హైదరాబాద్ మహానాడులో తెలంగాణవాళ్ళు అర్ధరాత్రి దాటేవరకు తాగి గానాబజానాల్లో తేలుతుంటే, ఎన్టీఆర్ పార్టీ పెట్టి వీళ్లకు క్రమశిక్షణ నేర్పించారని తెలంగాణ సంస్కృతిని ఎద్దేవా చేసిన నాయకుడు బాబు. అమరావతి రాజధానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ బ్రెయిన్ చైల్ వ్యాఖ్యకు కొనసాగింపుగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పుట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాదులో పుట్టింది కాబట్టి అది చంద్రబాబునాయుడు బ్రెయిన్ చైల్ ఎలా అయిందో ఆయనే వివరించాలి. నిజానికి ఆ పార్టీ పుట్టిన నాటికి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. ఆ పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు. తరవాత కాలంలో ఆయననుంచి పార్టీ లాక్కున్నవాడు చంద్రబాబునాయుడు.
అయినా చాలావాటిని సొంతం చేసుకున్నట్టు తెలంగాణను కూడా ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. సెల్ ఫోన్లు తనే కనుగొన్నానని, సాఫ్ట్ వేర్ ను తనే కనిపెట్టానని, కరోనా వ్యాక్సిన్ ను తనే తయారు చేశానని, చివరికి వంట గ్యాస్ వాడటం కూడా ప్రజలకు తానే నేర్పించానని ఆయన నమ్ముతూ ఉంటారు. అందరూ అది నమ్మాలని పదేపదే చెప్తూ ఉంటారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజం అవుతుందన్నది గోబెల్స్ సిద్ధాంతం. చేసిన పనులు చెప్పుకోవడానికే చాలామంది తటపటాయిస్తారు. చంద్రబాబుకు తాను చేయనివి కూడా సొంత ఖాతాలో వేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచానికి హైదరాబాద్ బిర్యానీ పరిచయం చేసింది తానేనని ఆయన చెప్పుకుంటే ఆయన శిష్యుడు ఒకరు, సినిమారంగానికి చెందినవాడు, ఈ మధ్య ఒక సినిమాలో ‘హైదరాబాద్ కో క్లింటన్ ఆయా, చంద్రబాబునే పాయా మంగాయా, క్లింటన్ పాయ ఖాయా, ఔర్ హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ ఆయా‘ అంటూ పాడాడు. అంటే, క్లింటన్ కు పాయా తినిపించి చంద్రబాబునాయుడు హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ తీసుకొచ్చాడని చెప్పదలుచుకున్నాడు ఆ వీర బాబు భక్తుడు.
ఇలా ఉంటుంది చంద్రబాబును అభిమానించేవాళ్ళు చేసే ప్రచారం. ఫలానా రాజకీయ నాయకుడు స్టేట్స్ మాన్ అని, విజనరీ అని ప్రపంచం మెచ్చుకుంటుంది. చంద్రబాబునాయుడు గారు ప్రపంచం మెచ్చుకునే దాకా ఆగరు. ‘నేను పుస్తకాలు చదవను .. ఎందుకంటే నేను విజనరీ, నేను స్టేట్స్ మన్’ అని పలు సందర్భాలలో చెప్పుకున్న విషయం వీడియోలలో ఉన్నది. హైదరాబాదీలు అత్యంత ఇష్టపడే వంటకం పాయా. ఇంకా నయం, మొగలాయిల నుండి వచ్చిన ఈ వంటకాన్ని కూడా బాబే ప్రపంచానికి పరిచయం చేశాడని చెప్పలేదు.
ఇక సాఫ్ట్ వేర్ విషయానికొస్తే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దేశంలో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించారు. అప్పుడు ఆ విషయాలలో ప్రధానమంత్రి సలహాదారుగా ఉండిన సామ్ పిట్రోడాను మర్చిపోవడానికి వీల్లేదు. ఆ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండిన నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ఒక ఐటీ భవనానికి శంకుస్థాపన చేస్తే తాను ముఖ్యమంత్రి అయ్యాక దానిని ప్రారంభించి ఆ ప్రాంతానికి హైటెక్ సిటీ అనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడు తాను ఒక నగరాన్ని నిర్మించానని చెప్పుకుంటుంటారు. అక్కడి పరిస్థితులను బట్టి, అప్పటి అవసరాలను బట్టి, ఆ ప్రాంతాలకు ఉండే సౌకర్యాన్ని బట్టి నగరాలు విస్తరిస్తూ ఉంటాయని, అభివృద్ధి జరుగుతుందని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఆయన అంగీకరించరు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు అదనంగా సైబరాబాద్ అనే మూడో నగరాన్ని తానే నిర్మించానని ఆయన అందరిని నమ్మమంటారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు 1995 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధానమైన పరిణామాలు జరిగాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు ఆర్థిక సంస్కరణలు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రాజీవ్ గాంధీ విత్తనం నాటితే ఆర్థిక సంస్కరణలకు అధ్యులు పీవీ నరసింహారావు, ఆయన వద్ద ఆర్ధికమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్. అటువంటి కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన హయాంలో ఎంతో కొంత ఈ రంగాలకు సంబంధించిన మార్పులు జరిగి ఉంటాయి. వాటిని చంద్రబాబునాయుడు తన ఖాతాలో వేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అనే ఒక అబ్సెషన్ (తెలుగులో మనోవ్యాధి లేదా యావ అంటారు) వదిలించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆయన తలపెట్టిన అమరావతి రాజధానికి ఏమైనా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే దాదాపు 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం ఇంకొంత కాలంపోతే అభివృద్ధిలో మరిన్ని అంగలు వేయడం తప్పనిసరి. అమరావతి ఇంకా ఉయ్యాలలో బిడ్డే. అందుకే పోలికలు అనవసరం. పోటీ వ్యర్థం.
ఆయన చెప్పేవన్నీ, తాను చేశానని చెప్పుకునేవన్నీ సమకాలికులు ఎవరూ నమ్మరు. బహుశా జెన్ జీ, జెన్ ఆల్ఫా కాలంలో జన్మించిన వాళ్ల కోసం ఇలా చేయని పనులు చేసినట్టు పదేపదే చెప్పుకుంటారేమో. 1997 – 2012 మధ్య, 2010 – 2024 మధ్య పుట్టిన వాళ్లు ఈ జెన్ జీ, జెన్ ఆల్ఫా కోవలోకి వొస్తారు. అయితే అసలేం జరిగిందో చరిత్రకారులు చెప్తారు. చంద్రబాబునాయుడు చెప్పింది వేదం అనుకునే తరాలు కావవి. చరిత్ర చదివి సత్యాసత్యాలను పట్టేస్తాయి.ఇక చివరగా చంద్రబాబునాయుడుకు అత్యంత ప్రియమయిన ఒక అంశం గురించి చెప్పాలి, అదే మీడియా. గత శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అనే తీర్మానాన్ని హర్ష ధ్వానాల మధ్య ఆమోదింపచేసుకున్న ఉత్సాహం వెంట రాగా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ జాతీయ మహాసభలు ప్రారంభించడానికి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ మీడియాగురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సభల్లో చంద్రబాబు కొన్ని జర్నలిజం పాఠాలు చెప్పారు. ఇవాళ్టి పరిస్థితుల్లో జర్నలిజాన్ని రెండుగా విభజించాలని,
ఒకటి వృత్తి నిబద్ధత కలిగిన జర్నలిజం అయితే ఇంకొకటి రాజకీయ ప్రేరేపిత జర్నలిజం అని అన్నారు. ఇదమిత్ధంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే తనను, తన రాజకీయాలను సమర్ధించే మీడియా వృత్తి నిబద్దత కలిగిన మీడియా అని, తన లోపాలను, తన రాజకీయాల్లో, పరిపాలనలో జరిగే తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపే మీడియా రాజకీయ మీడియా అని. తనను విమర్శించే మీడియామీద ముద్రలు వేయడం, వాటి మైండ్ సెట్ మారాలని బహిరంగంగానే బెదిరించడం 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గరనుండే ఆయన మొదలుపెట్టారు. ఆ కాలంలో జర్నలిజం వృత్తిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రిపోర్టర్లు ఎవరిని అడిగినా చెప్తారు.. ఆయన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో జరిగే తప్పులను ఎత్తిచూపి వార్తలు రాసిన విలేకరులు ఎప్పుడో ఒకసారి అయినా ‘మీ మైండ్ సెట్ మారాలి’ అన్న హెచ్చరిక చంద్రబాబునుంచి వినడం గాని లేదా ఆయన యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు ఊడగొట్టుకోవడం కానీ అనుభవం లోకి వచ్చాయో లేదో.
