Reading Time: 2 minutes
Us Military Rescue Operation Iran F15 Pilot Jolly Green Ii Special Forces

US pilot rescue Op: ఇరాన్‌లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ సంచలనంగా మారింది. శత్రుదేశ భూభాగంలో అతడిని రక్షించిన విధానం సినిమాకు తక్కువేం కాదు. ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూల్చేసి ఇరాన్ విజయం సాధించిందని భావించింది, పైలట్లను సజీవంగా పట్టుకోవాలని చూసింది. కానీ, అమెరికా వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. విమానం కూలిన తర్వాత వెంటనే ఒక పైలట్‌ను కొన్ని గంటల్లోనే రెస్క్యూ చేశారు. మరో పైలట్ కోసం తీవ్రంగా గాలించారు.

రంగంలోకి స్పెషల్ ఫోర్సెస్:

ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాము పైలట్‌ను రక్షించామని చెప్పారు. అతడిని తీసుకురావడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఆయుధాలను కలిగిన డజన్ల కొద్దీ విమానాలను పంపించామని, అతడిని రక్షించామని వెల్లడించారు. ఈ రెస్క్యూ కోసం వందలాది మంది స్పెషల్ ఫోర్సెస్ పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ కోసం అమెరికా బలగాలు HH-60W ‘జాలీ గ్రీన్ II’ రెస్క్యూ హెలికాప్టర్లు, A-10 వార్‌హాగ్ అటాక్ జెట్‌లు, ఒక HC-130 రెస్క్యూ మిడ్-ఎయిర్ ట్యాంకర్, సుదూర పరిధిలో పనిచేసే F-35 స్టెల్త్ జెట్‌లు, ప్రత్యేక దళాలు మరియు ఒక కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రత్యేక విభాగాన్ని ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (CSAR) హెలికాప్టర్ అయిన సికోర్స్కీ HH-60W ‘జాలీ గ్రీన్ II’ను ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా మారింది. సుదూర ప్రయాణాలు, అత్యాధునిక సెన్సార్లు ఇందులో ఉన్నాయి.

రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరిగింది.?

శుక్రవారం విమానం నుంచి కిందకు దూకిన తర్వాత F-15 పైలట్ మరియు వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ ఇద్దరూ తమ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా ఒకరితో ఒకరు సంప్రదించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఇరాన్ ఒక అమెరికన్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌‌పై దాడి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ జరిగింది.

పైలట్ గురించి ముందుగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) ఇరాన్‌లో ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది. అమెరికా దళాలు అతన్ని అప్పటికే కనుగొన్నాయని, భూమార్గం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ ప్రచారం చేసినట్లు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. నేలపై దిగిన తర్వాత పైలట్ స్థానిక కొండల్లో వెళ్లి దాక్కున్నాడు. అతని వద్ద కేవలం చిన్న పిస్టల్ మాత్రమే ఉంది. జీపీఎస్, డిస్ట్రెస్ బీకన్ ద్వారా అమెరికా సైన్యంతో అతను కాంటాక్ట్ అయ్యారు.

ఇదే సమయంలో పైలట్ కోసం ఇరాన్ తీవ్రంగా వెతకడం ప్రారంభించింది. అమెరికా సైన్యం అతడిని ముందుగా రెస్క్యూ చేయాలని భావిస్తుంటే, ఇరాన్ సైన్యం అతడిని పట్టుకోవాలని అనుకుంది. రెస్క్యూ జరుగుతున్న సమయంలో అమెరికా విమానాలు ఇరాన్ కాన్వాయ్‌లు పైలట్ ఉన్న ప్రాంతానికి రాకుండా బాంబులు వేశాయి. శత్రువులను దూరంగా ఉంచేందుకు ఫైరింగ్ ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర యుద్ధం నడిచింది. రాత్రి సమయంలో పైలట్ ఉన్న ప్రాంతానికి కమాండోలు ప్రవేశించారు, ఓ వైపు తీవ్రంగా కాల్పులు జరుగుతున్నప్పుడు అతడిని ప్రాణాలతో రక్షించారు. గాయాలైనప్పటికీ పైటల్ సురక్షితంగా ఉన్నాడు. రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరు పైలట్లను రక్షించడం అమెరికా చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన.