Reading Time: < 1 minute

అన్నంత పని చేసిన ట్రంప్.. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి

Caption of Image.

మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రస్తుతం అణు విస్ఫోటనం అంచుకు చేరుకుంటోంది. శనివారం ఉదయం ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరిగిన భారీ దాడి ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. స్థానిక సమయం ప్రకారం ఉదయం 8:30 గంటలకు పర్షియన్ గల్ఫ్ తీరంలోని ఈ కీలక కేంద్రానికి సంబంధించిన ప్రాంగణంలో క్షిపణి వచ్చి పడటంతో ఒక సెక్యురిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన అణు రియాక్టర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని.. రేడియేషన్ ముప్పు లేదని అధికారులు చెబుతున్నప్పటికీ ఇరాన్ మొదటి వాణిజ్య అణు కేంద్రంపై దాడి జరగడం ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది.

ఈ దాడికి ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. అమెరికా సైన్యం ఇంకా విధ్వంసాన్ని మొదలుపెట్టనే లేదని.. తదుపరి లక్ష్యం వంతెనలు, ఆపై పవర్ ప్లాంట్లే అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ అధికారుల్లోనూ వేడిని పుట్టిస్తోంది. కొత్త నాయకత్వం వెంటనే దిగిరాకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.

ALSO READ : ఒకేసారి రెండు యూఎస్ ఫైటర్ జెట్లను కూల్చిన ఇరాన్..

అయితే తగ్గేదే లే అన్నట్లుగా ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. తమ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అమెరికా దాని భాగస్వామ్య దేశాలపై ఊహించని రీతిలో విరుచుకుపడతామని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగరీ హెచ్చరించారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు అణు కేంద్రాల వద్ద వరుస దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుషెహర్ అణు ప్లాంట్ వద్ద జరిగిన తాజా ఘటన ఇరాన్-అమెరికా మధ్య యుద్ధాన్ని మరో ప్రమాదకర స్థాయికి తీసుకెళుతోందనే భయాలను పెంచేస్తోంది అందరిలోనూ. రాబోయే రోజుల్లో ఇరాన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు పెరిగితే ఆ దేశం పూర్తిగా చీకట్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.