
30 కోట్లతో కాచిగూడలో జగ్జీవన్ రామ్ భవన్
లోయర్ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ నిర్మాణం
జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మన తెలంగాణ / హైదరాబాద్ : జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే మహనీయుడు చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగిస్తూ, దళితులు, పేద, అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం దళితుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు.
జగ్జీవన్ రామ్ దళితుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. కాచిగూడ లోని నింబోలి అడ్డలో రూ. 30 కోట్లతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నిర్మిస్తున్నామని, లోయర్ ట్యాంక్ బండ్ లో పది అంతస్తులకు తగ్గకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. అణగారిన వర్గాల పక్షాన నిలబడిన అరుదైన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అభివర్ణించారు. అవకాశం లభిస్తే దళితుడు కూడా ఉన్నత నాయకత్వం చేపడతాడు అనే నమ్మకాన్ని ఆయన కార్యాచరణతో నిరూపించారని అన్నారు. రాజ్యాంగంలో ఎస్‌సి, ఎస్‌టిల హక్కులు, రిజర్వేషన్లు కాంగ్రెస్ దృక్పథంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. భూమి సంస్కరణలు, విద్యా అవకాశాల ద్వారా పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని వివరించారు.
త్వరలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
రాష్ట్రంలో ప్రజాపాలన పారదర్శకంగా సాగుతోందని, దళితుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అనే సంకల్పంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు. సంక్షేమం మాత్రమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలో పూర్తి సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిబ్మోలి గడ్డ హాస్టల్‌కు ఆధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు.
సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరేలా కృషి చేస్తూ, వివక్షలేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ ఆశయాలకు దళిత ఐక్యతే మా బలం, సామాజిక న్యాయం కాంగ్రెస్ ధర్మం అంటూ నినాదాలు చేశారు. ప్రతి దళిత కుటుంబానికి గౌరవం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జగ్జీవన్ రామ్ కలల భారతాన్ని తెలంగాణలో సాకారం చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ విప్ అద్దంకి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, నాగరాజు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కాసిం, ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, జేబీ రాజు, మేడి పాపయ్య, ఉత్సవ కమిటీ నేతలు, పలువురు దళిత నాయకులు కార్యక్రమానికి హాజరై బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ఆలపించిన గీతాలు ఆహుతులను ఉర్రూతలుగుంచాయి