
కొల్హాపూర్ చెప్పులకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. వాటి రాజసం మరే చెప్పులకు రాదంటారు అప్పటివాళ్లు. కాకపోతే.. వాటిని గట్టి తోలుతో తయారుచేస్తారు. అందుకే ఇప్పటివాళ్లు వాటికి కాస్త దూరమయ్యారు. కానీ.. ఆ దూరాన్ని తగ్గించేందుకు మెత్తటి తోలుతో చెప్పులు తయారుచేస్తున్నాడు హర్షవర్ధన్. అంతేకాదు.. గతంలో ఒకే రంగులో లభించే కొల్హాపూర్ చెప్పులకు అన్ని రకాల రంగులను అద్ది మాడ్రన్ ఫుట్‌వేర్‌గా తీర్చిదిద్దాడు. అలా వాటితో యూత్‌ని అట్రాక్ట్ చేయడమే కాకుండా ‘కొల్హాపూర్’ని గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేశాడు.
హర్షవర్ధన్ పట్వర్ధన్ పుణెలో పెట్టి, పెరిగాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత కుటుంబ వ్యాపారం (ట్రాన్స్‌పోర్ట్)లో కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూరప్‌లోని నాటింగ్‌హామ్‌కు వెళ్లాడు. ఆ టైంలో కాలేజీలో ఒక ఫెస్ట్ జరుగుతున్నప్పుడు హర్ష కుర్తాతోపాటు బ్రాండెడ్ చెప్పులు వేసుకున్నాడు. కానీ.. అది చూసిన వాళ్ల అన్నయ్య కుర్తా మీదికి కొల్హాపూర్ చెప్పులు వేసుకుంటే బాగుంటుందని తన చెప్పులను ఇచ్చాడు. హర్షకు ఆ చెప్పులు వేసుకోవడం అదే మొదటిసారి. వాటితో డ్యాన్స్ చేస్తున్నప్పుడు అతనికి చాలా కంఫర్ట్‌గా అనిపించింది. అప్పటినుంచి మంచు, క్లబ్‌లకు.. ఎక్కడికి వెళ్లినా వాటినే వేసుకునేవాడు. ఇప్పటికీ హర్ష కొల్హాపూర్ చెప్పులే వాడుతున్నాడు.
మెత్తని తోలుతో..
సాధారణంగా కొల్హాపూర్ చెప్పులు ఒకే రంగులో, గట్టిగా ఉంటాయి. వాటిని మరింత సాఫ్ట్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చాలి అనుకున్నాడు హర్షవర్ధన్. అప్పుడే తన ఫ్రెండ్ వేసుకున్న లెదర్ జాకెట్, కొల్హాపూర్ ప్యాంటు చూశాడు. రెండూ తోలుతోనే తయారవుతాయి. కానీ.. లెదర్ జాకెట్ మృదువుగా, కొల్హాపూర్ ప్యాంటు గట్టిగా ఉంది. మృదువైన తోలుతో కొల్హాపూర్ చెప్పులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి అతను తోలు గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఆగ్రా, కాన్పూర్, చెన్నైల్లో తోలు శుద్ధి కర్మాగారాలకు వెళ్లాడు. సుమారు ఒక నెల తర్వాత, జాకెట్లలో వాడే తోలు ఎందుకు మృదువుగా ఉంటుందో అతనికి అర్థమైంది. ముడిపదార్థం ఒకటే అయినా, దానిని ప్రాసెస్ విధానం చాలా భిన్నంగా ఉంటుంది.
కొల్హాపూర్ చెప్పుల్లోని తోలును సంప్రదాయ పద్ధతిలో తయారుచేస్తారు. ఈ ప్రక్రియను బ్యాగ్ ట్యానింగ్ అంటారు. ఆధునిక క్రోమ్ ట్యానింగ్ పద్ధతిలో మృదువైన తోలు తయారుచేస్తారు. తోలు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత హర్షవర్ధన్ రకరకాల తోలు షీట్లను సేకరించి వాటితో చెప్పులు చేశాడు. ‘‘కొల్హాపూర్ చెప్పులను సుమారుగా 12వ లేదా 13వ శతాబ్దం నాటి నుంచి వాడుతున్నారని చెప్తుంటారు. వాటిని పూర్తిగా చేతితోనే తయారుచేస్తారు. తోలుని శుద్ధి చేసి, వృక్ష సంబంధిత రంగులను అద్దుతారు. భారతీయ హస్తకళా వారసత్వంలో ఈ కళకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇవి ప్రధానంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో తయారవుతాయి. ఈ ఆధునిక ప్రపంచంలో అనేక రకాల చెప్పులు అందుబాటులోకి వచ్చినప్పటికీ, కొల్హాపూర్ చెప్పుల క్రేజ్ తగ్గడం లేదు. అందుకే నేను కూడా బిజినెస్ పెట్టాలనే ఆలోచన రాగానే రోజూ కొల్హాపూర్‌కు వెళ్లి కారిగర్లతో (చెప్పులు కుట్టేవారితో) కలిసి రోజంతా చెప్పులు తయారు చేశా. వాళ్ల ఇళ్లలోనే లంచ్ చేసేవాడిని. వాళ్ల గుడిసెల్లోనే ఉండేవాడిని. అచ్చం స్కూల్ పిల్లాడిలా ప్రతిదీ నేర్చుకునేవాడిని”అని చెప్పాడు హర్షవర్ధన్. అలా ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత బిజినెస్‌లోకి దిగాడు.
చప్పర్స్ ఎలా మొదలైంది?
హర్షవర్ధన్ తయారుచేసిన చెప్పులను ఫ్రెండ్స్, బంధువులకు అమ్మేవాడు. ఆ తర్వాత పుణెలోని ఒక మాల్‌లో స్టాల్ ఏర్పాటుచేశాడు. అక్కడ ఒకే రోజులో 100 జతల బూట్లు అమ్మాడు. వాటి క్వాలిటీ నచ్చి, ఎంతోమంది రిపీటెడ్‌గా ఆర్డర్లు ఇచ్చారు. దాంతో 2015లో చాలా తక్కువ పెట్టుబడితో చప్పర్స్ పేరుతో బ్రాండ్‌ని స్థాపించాడు. మార్కెట్‌లో చప్పర్స్‌ను ప్రత్యేకంగా నిలిపేది ఏంటంటే.. ఇది దేశంలోనే ఏఆర్(ఆగ్మెంటెడ్ రియాలిటీ)ని ఉపయోగించే మొట్టమొదటి వర్చువల్ ఫుట్‌వేర్ కస్టమైజర్. కస్టమర్లు దుకాణాల్లో అయితే టచ్ స్క్రీన్ కియోస్క్‌ల ద్వారా, ఆన్‌లైన్‌లో డిజిటల్ స్క్రీన్ మీద రంగులు, యాక్సెసరీలు, మెటీరియల్ ఎంచుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఇటాలియన్ లెదర్, కొరియన్ యాక్సెసరీలు వంటి ప్రీమియం ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.2,500 నుంచి రూ.50,000 వరకు ధరలు ఉన్నాయి.
27 దేశాలకు ఎగుమతి
ఇప్పుడు చప్పర్స్కు ప్రతి నెలా కొన్ని వందల ఆర్డర్లు వస్తున్నాయి. పుణెలోని నాలుగు మాల్స్‌లో రిటైల్ స్టోర్లు ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాలతో పాటు అమెరికా, యూకే సహా 27 దేశాలకు చెప్పులను ఎగుమతి చేస్తున్నారు. 35 వేల మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. చప్పర్స్లో ఎంతోమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీ ఆదాయం సంవత్సరానికి రూ. 3 కోట్ల పైగానే ఉంది. హర్షవర్ధన్ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 350 మాల్స్‌లో స్టోర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు.