మనం ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని పళ్లు తోముకోవడం. ఆరోగ్యంగా ఉంటామని మనం నమ్మి వాడే ఆ టూత్‌పేస్టే మన ప్రాణాల మీదకు వస్తుందని తెలిస్తే..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇటీవల మార్కెట్లో వెలుగు చూస్తున్న నకిలీ టూత్‌పేస్ట్‌ల ఉదంతాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అందుకే ప్రముఖ బ్రాండ్ల పేర్లతో చలామణి అవుతున్న ఈ విషపు పేస్ట్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు అత్యవసరం.
నకిలీ పేస్ట్‌లో ఏముంటుంది?: సాధారణంగా నాణ్యమైన టూత్‌పేస్ట్‌లలో వాడే రసాయనాలు నిర్ణీత పరిమితిలో ఉంటాయి. కానీ నకిలీ వాటిలో డైఇథిలీన్ గ్లైకాల్ కలుపుతారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. ఇది మూత్రపిండాలు, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుంది. తక్కువ స్థాయి ఫ్లోరైడ్ దంతాల రక్షణకు బదులుగా ఎనామెల్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. అపరిశుభ్రమైన వాతావరణంలో తయారవ్వడం వల్ల వీటి ద్వారా నోటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం మెండుగా ఉంది.
అసలైన టూత్‌పేస్ట్‌ను గుర్తించడం ఎలా?: మీరు కొనే టూత్‌పేస్ట్ నకిలీదా లేక అసలైనదా అని ఈ చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్ల బార్కోడ్స్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకు.. కోల్గేట్ బార్కోడ్ సాధారణంగా 35000 తో ప్రారంభమవుతుంది. మీ ఫోన్లోని స్కానర్ యాప్‌తో దీన్ని చెక్ చేయవచ్చు. నకిలీ డబ్బాల మీద అక్షర దోషాలు, నాసిరకమైన రంగులు, అస్పష్టమైన ముద్రణ కనిపిస్తాయి. అసలు పేరును పోలి ఉండేలా చిన్న మార్పులతో నకిలీవి తయారు చేస్తారు. వాడేటప్పుడు అసాధారణ రుచి లేదా అతిగా, తక్కువగా నురుగు రావడం, నోటిలో మంట పుట్టడం వంటివి జరిగితే అది ఖచ్చితంగా నకిలీదే.
రంగు గుర్తుల వెనుక ఉన్న అసలు నిజం: చాలా మంది టూత్‌పేస్ట్ ట్యూబ్ వెనుక ఉండే ఆకుపచ్చ లేదా నలుపు రంగు చతురస్రాలను చూసి, అది సహజమైనదా లేక రసాయనాలతో కూడినదా అని భ్రమపడుతుంటారు. ఆ రంగు గుర్తులు కేవలం ప్యాకేజింగ్ యంత్రాల కోసం మాత్రమే. ట్యూబ్‌ను ఎక్కడ కత్తిరించాలో సెన్సార్లకు తెలియజేయడానికి వాడే ఐ మార్క్స్ ఇవి. వీటికీ లోపల ఉండే పదార్థం నాణ్యతకూ ఎటువంటి సంబంధం లేదు.
వీధి వ్యాపారుల వద్ద లేదా అతి తక్కువ ధరకే వస్తున్నాయని తెలియని వెబ్సైట్ల నుండి టూత్పేస్ట్లు కొనకండి. పేరున్న ఫార్మసీలు లేదా సూపర్మార్కెట్లలోనే కొనుగోలు చేయండి. గడువు తేదీ ముగిసిన లేదా దాని మీద తప్పులు ఉన్న ప్యాకెట్లను తీసుకోవద్దు. టూత్‌పేస్ట్ వాడిన తర్వాత నోటిలో ఏవైనా పుండ్లు లేదా వాపు కనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించండి.




