Reading Time: < 1 minute
అతి తక్కువ ధరలో EV స్కూటీలు వచ్చేస్తున్నాయ్‌! మిడిల్ క్లాస్‌ టార్గెట్‌గా..

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రీమియం స్కూటర్లకే పరిమితమైన ఈ సంస్థ, ఇప్పుడు మధ్య తరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆథర్ 450 సిరీస్, రిజ్టా వంటి మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్‌లో ఉండి, వాటి ధరలు సుమారు రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే కొత్తగా అభివృద్ధి చేస్తున్న బడ్జెట్ స్కూటర్ ధరను సుమారు రూ.1 లక్ష వద్ద ఉంచేలా కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

EL అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఈ వాహనం తయారవుతోంది. ఇది ప్రత్యేకంగా ఖర్చులను తగ్గించే విధంగా డిజైన్ చేయబడిన ప్లాట్‌ఫారమ్ కావడం గమనార్హం. రోజువారీ ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని అందించనున్నట్లు సమాచారం. ధరను తగ్గించినప్పటికీ, టెక్నాలజీ విషయంలో ఏథర్ రాజీ పడదని కంపెనీ స్పష్టం చేస్తోంది. కనెక్టెడ్ ఫీచర్లు, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, వినియోగదారులకు అనుకూలమైన డిజిటల్ ఇంటర్‌ఫేస్ వంటి సౌకర్యాలు ఈ మోడల్‌లో ఉండే అవకాశముంది. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సౌకర్యవంతమైన సీటింగ్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నగరాల్లో రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా ఈ వాహనాన్ని రూపకల్పన చేస్తున్నారు.

మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన వంటి అంశాలు వినియోగదారులను ఈవీల వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్‌, TVS, బజాజ్‌ ఆటో వంటి కంపెనీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. వీటి నుంచి ఓలా S1X, TVS iQube, బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వంటి మోడళ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ పోటీ మధ్య, తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లతో వచ్చే ఏథర్ కొత్త స్కూటర్ మిడిల్ క్లాస్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి