
సంసేర్‌గంజ్: ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రజలు ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పేర్లు తొలగించిన వారు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని కూడా ఆమె సూచించారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సంసేర్‌గంజ్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రజల పేర్లు తొలగించిన వారిపై మీ ఓటుతో ప్రతిస్పందించండి. ఫలితాలు దానికి తగినట్లుగా ఉండాలి అని అన్నారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ రోజు మే 4 వరకు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుంటూ, ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపుకు ఆయన బాధ్యత వహిస్తున్నారని మమతా ఆరోపించారు. ధైర్యం ఉంటే నేరుగా పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు. అలాగే ఎన్నికల సమయంలో బూత్ ఏజెంట్లు బీజేపీకి అమ్ముడుపోకూడదని పార్టీ కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేశారు.
ఈవీఎంలు కొన్ని చోట్ల పనిచేయకుండా చేయవచ్చని ఆరోపిస్తూ, అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అధికారులు మరమ్మత్తులు చేయడానికి అనుమతించకుండా, కొత్త యంత్రాలను డిమాండ్ చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు. సంసేర్‌గంజ్‌లో మొహమ్మద్ నూర్ ఆలం, ఫరక్కాలో మొహమ్మద్ అమీరుల్ ఇస్లాం అభ్యర్థిత్వానికి మద్దతుగా నిర్వహించిన సభలో మమతా, వక్ఫ్ (సవరణ) చట్టంపై తాను గట్టిగా పోరాడుతున్నానని తెలిపారు. తనపై ముస్లింల కోసం ఏమీ చేయలేదని బీజేపీ ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. వక్ఫ్ చట్టం అమలులో ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసను ప్రస్తావిస్తూ, కొంతమంది మరణించారని గుర్తుచేశారు. అయితే ఆ హింసకు తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఎన్నికల సంఘం దాదాపు 500 మంది అధికారులను బదిలీ చేసిందని ఆమె విమర్శించారు. ఈ మార్పులు తాత్కాలికమే, ఎన్నికల తర్వాత మళ్లీ పనులు ప్రారంభమవుతాయి అని చెప్పారు.
ఎన్నికల జాబితాలో కొందరి పేర్లు తొలగిస్తూ, మరికొందరిని బెదిరిస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన మమత, 2024 లోక్‌సభ ఎన్నికల జాబితాతోనే అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అప్పటి జాబితాలో అక్రమ వలసదారులు ఉన్నారని భావిస్తే, ఆ ఓట్లతో గెలిచిన ప్రధాని, హోం మంత్రి ముందుగా రాజీనామా చేయాలి అని విమర్శించారు. ఎన్‌ఆర్‌సీ పేరుతో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేయడానికి తాను ఎప్పటికీ అనుమతించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే రాష్ట్ర పాలనపై ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుందని కూడా ఆమె గుర్తుచేశారు.