
అమరావతి: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ఓ నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిదంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం జన్మించిన ఓ శిశువుకు కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అనకాపల్లి జిల్లాలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం (ఏప్రిల్ 4) ప్రత్యేక వార్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ అందక శిశివు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ALSO READ : హైదరాబాద్ నుంచి వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆగే చెన్నై స్టేషన్ మారింది..!
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. చిన్నారి చావుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు రంగంలోకి దిగారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింపజేశారు.