
టెహ్రాన్: ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించే ప్రయత్నం పూర్తిగా విఫలమైంది అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఆ సిబ్బంది పట్టుబడ్డారని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైలట్‌ను సురక్షితంగా రక్షించాం అని ప్రకటించిన కొన్ని గంటలకే వెలువడడం గమనార్హం. ఇరాన్ సాయుధ దళాల సమన్వయ కమాండ్ ‘ఖాతమ్ అల్-అన్‌బియా’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారీ టెలివిజన్ ద్వారా విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ఇస్ఫహాన్‌లోని నిర్జన విమానాశ్రయం వద్ద కూలిన యుద్ధవిమాన పైలట్‌ను రక్షించే పేరిట అమెరికా చేపట్టిన మోసపూరిత ఆపరేషన్‌ను పూర్తిగా భగ్నం చేశాం అని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో రెండు సి-130 రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భూమిపై వాస్తవ పరిస్థితులు ఇరాన్ సైనిక శక్తి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ, ట్రంప్ ఖాళీ ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మాధ్యమాలు విడుదల చేశాయి. ఎడారి ప్రాంతంలో కాలిపోయిన యుద్ధ వాహనాల అవశేషాలు, పొగలు కక్కుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.
రక్షణ చర్య సమయంలో జరిగిన దాడుల్లో దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఐదుగురు మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే వారు పౌరులా లేక సైనికులా అన్నది స్పష్టత రాలేదు. ఇక శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన అమెరికా సిబ్బంది కోసం స్థానికులు కూడా శోధనలో పాల్గొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయుధాలు, జెండాలు పట్టుకున్న కొందరు ప్రజలు ఆ పైలట్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలను ప్రసారం చేశారు. ఈ పరిణామాలతో అమెరికాఇరాన్ మధ్య సమాచార యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు అమెరికా రక్షణ చర్య విజయవంతమైందని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ దాన్ని పూర్తిగా విఫలమైందని ప్రకటించడం గమనార్హం.