
హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం జనావాసాలకు దగ్గరగా ఉండటమే కాకుండా వన్యప్రాణులు కూడా ఉండటమే అందుకు కారణమని చెప్పారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళనను అర్ధం చేసుకుని చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనే పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదమేనని బండి మండిపడ్డారు. గత పాలకులు ఇక్కడే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చిందన్నారు. ఆనాడు డంపింగ్ యార్డును హుజూరాబాద్ సమీపంలోనే ఏర్పాటు చేయాలని చెప్పిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులే ఈరోజు అందుకు భిన్నంగా ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు.
శనివారం మధ్యాహ్నం హుజూరాబాద్ లో పర్యటించిన బండి సంజయ్.. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డితోపాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలోని డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో హుజూరాబాద్ మున్సిపాలిటీ శివారు ప్రాంతమైన సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తుండటంతో హుజూరాబాద్ ప్రజలకు తీవ్రమైన హానీ చేకూరే ప్రమాదముందని ఈ సందర్భంగా స్థానికులు బండి సంజయ్ ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డు ప్రాంతంలోనున్న గుట్టల్లో నెమళ్లు, పక్షులు సహా నిత్యం వన్యప్రాణులు సంచరిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు చచ్చిపోతాయని, దీంతోపాటు మనుషుల ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…. “హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది. హుజూరాబాద్ మున్సిపాలిటీకి సమీపంలో డంపింగ్ యార్డు ఉంది. ఇక్కడ చుట్టు పక్కల గ్రామాలున్నాయి. వీరిపై తీవ్ర ప్రభావం ఉంది. ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను స్రుష్టించడం సరికాదు. ప్రజల ప్రాణాలతో చెలగాడటం సరికాదు. నిజానికి ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది గత పాలకులు. ఈ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్ సభలో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే… మొట్టమొదట వ్యతిరేకించింది నేనే. ఆనాడు ఏ ఒక్కరూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అయినా ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఆనాడే డంపింగ్ యార్డు ప్రతిపాదనను వ్యతిరేకించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే పాపానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని పున:పరిశీలించాలి. అవసరమైతే హుజూరాబాద్ ప్రాంతానికి వచ్చి ఒక్కసారి డంపింగ్ యార్డు స్థలాన్ని సందర్శించాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా పోరాటాలు చేస్తాం” అని హెచ్చరించారు.