
వాషింగ్టన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైయిట్ ఆఫ్ హార్మూజ్‌ను తెరిచేందుకు విధించిన గడువు ఏప్రిల్ 6తో ముగియనున్న నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ వరుసగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 48 గంటల్లోగా హార్మూజ్‌ను ఓపెన్ చేయకపోతే ప్రళయంలా విరుచకుపడతామని శనివారం (ఏప్రిల్ 4) హెచ్చరించిన ట్రంప్ ఆదివారం (ఏప్రిల్ 5) మరోసారి ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జల సంధిని తెరవకపోతే మంగళవారం (ఏప్రిల్ 7) ఇరాన్ మౌలిక సదుపాయాలను పూర్తిగా నేలమట్టం చేస్తామని.. ముఖ్యంగా ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు, భారీ వంతెనలే లక్ష్యంగా విరుచుకుపడతామని బెదిరించారు.
‘‘ఇరాన్‌లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకే రోజు జరగనున్నాయి. ఇలాంటిది మరెక్కడా జరగదు..! హార్మూజ్ జలసంధిని తెరవండిరా పిచ్చి వెధవల్లారా.. లేకపోతే నరకానికి పంపిస్తాం. అల్లాని ప్రార్థించండి’’ అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ట్రంప్. సోమవారం (ఏప్రిల్ 6) లోపు హార్మూజ్ జల సంధిని తెరవకపోతే మంగళవారం (ఏప్రిల్ 7) ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి పరుష పదజాలంతో ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించడం గమనార్హం.
►ALSO READ | ట్రంప్ మాటలు పచ్చి అబద్ధం: అమెరికా రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. నిప్పులు చెరిగిన ఇరాన్
ఎన్నిసార్లు బెదిరించినప్పటికీ ఇరాన్ లెక్కచేయకపోవటంతో ట్రంప్‌లో అసహనం పెరిగిపోతుందని.. అందుకే పరుష పదజాలంతో దూషిస్తున్నాడంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉండగా.. ఇరాన్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అమెరికా డిమాండ్లను అంగీకరించే సమస్య లేదేని ఇరాన్ తెగేసి చెబుతోంది. దీంతో ఏప్రిల్ 7న ఏం జరగబోతుందోనని ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.