Reading Time: 2 minutes
Rayalaseema Special Minapa Pachadi Recipe Health Benefits

Rayalaseema Special Chutney : ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదా ఏదైనా స్పెషల్ గా తినాలనిపించినా.. చిటికెలో చేసుకోగలిగే అద్భుతమైన రెసిపీ ‘మినప పచ్చడి’. రాయలసీమ ప్రాంతంలో ఎంతో ఫేమస్ అయిన ఈ పచ్చడి, ఒక్కసారి చేసుకుంటే వారం పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. అన్నం, ఇడ్లీ లేదా దోశల్లోకి కూడా అదిరిపోయే కాంబినేషన్‌గా నిలిచే ఈ మినప పచ్చడిని తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.

పచ్చడికి కావలసిన పదార్థాలు:
మినప్పప్పు (సాయి పప్పు లేదా గుళ్ళు) – పావు కప్పు

పొట్టు మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు

ఎండుమిర్చి – 10 నుండి 15 (కారానికి తగినట్లు)

ధనియాలు – 1 టేబుల్ స్పూన్

జీలకర్ర – 1 టీ స్పూన్

మెంతులు – పావు టీ స్పూన్

టమాటా – 1 (పెద్దది)

వెల్లుల్లి రెబ్బలు – 4 నుండి 5

చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు అంత

కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె – తగినంత

తయారీ విధానం..
పచ్చడి నిల్వ ఉండాలంటే చింతపండును ముందుగా వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని మినప్పప్పు, పొట్టు మినప్పప్పు వేసి చిన్న మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, మెంతులు, జీలకర్రలను కూడా విడివిడిగా వేయించి చల్లారనివ్వాలి. పాన్లో కొద్దిగా నూనె వేసి టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. అనంతరం ముందుగా వేయించుకున్న దినుసులను మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన చింతపండు, మగ్గించిన టమాటా, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొన్ని కాచి చల్లార్చిన నీళ్లను వాడుకోవచ్చు. చివరగా పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి ఒకసారి పల్స్ ఇస్తే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటేనే ఈ పచ్చడికి అసలైన రుచి వస్తుంది. ఈ పచ్చడికి ప్రత్యేకంగా తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. నేరుగా అన్నం లేదా కొర్ర అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఈ పచ్చడిని మినప్పప్పుతో చెస్తారు. నిజానికి మినప్పప్పులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి కండరాల పెరుగుదలకు, కణజాల మరమ్మతుకు ఎంతో అవసరం. అలాగే ఇందులో వాడే జీలకర్ర, మెంతులు, చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మెంతులు శరీరంలోని వేడిని తగ్గించడానికి, గ్యాస్ సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. వెల్లుల్లి, టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మినప్పప్పులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి, ముఖ్యంగా మహిళలకు మంచి శక్తిని ఇస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు లేదా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఈ పచ్చడిని తింటే నోటికి రుచిగా ఉండటంతో పాటు, మినప్పప్పులోని కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. మినప్పప్పులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా తోడ్పడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చడిని మీకు సమయం కుదిరినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో చేసుకోడానికి ప్రయత్నించండి.

READ ALSO: Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..