
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో న్యాయాధికారులను గంటల తరబడి ముట్టడి చేసిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఘటనను మహా జంగిల్‌రాజ్‌గా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కూచ్ బెహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ, న్యాయాధికారులే సురక్షితంగా లేనప్పుడు, సాధారణ ప్రజల భద్రత ఎలా ఉంటుందో ఆలోచించండి అని అన్నారు. మాల్దాలో జరిగిన ఘటన దేశమంతా చూసింది. న్యాయమూర్తులకే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడగలదు? అని ప్రశ్నించారు. టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ, బెంగాల్ వంటి పవిత్ర భూమిపై ప్రజాస్వామ్యం ప్రతిరోజూ దాడికి గురవుతోంది అని మోదీ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యవస్థను పూర్తిగా కూల్చివేయడానికి టీఎంసీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మాల్దా ఘటనను ప్రస్తావిస్తూ, ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో పేర్లు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు కాళియాచక్-2 బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో న్యాయాధికారులను ముట్టడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఘటనను బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. అలాగే చొరబాటుదారుల సమస్యను లేవనెత్తిన మోదీ, టీఎంసీ పాలనలో సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పు ప్రమాదకరంగా మారింది. చొరబాటుదారులకు టీఎంసీ సిండికేట్ రక్షణ కల్పిస్తోంది అని ఆరోపించారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్)ను టీఎంసీ వ్యతిరేకించడం వెనుక ఉద్దేశ్యం చొరబాటుదారులను కాపాడడమేనని మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. టీఎంసీబీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి.