
మన తెలంగాణ/సిటీబ్యూరో: యూఎల్ సీ భూముల్లోని పాత లేఔట్లలో ఇళ్లనే కాదు ఖాళీ ప్లాట్లున్నా వాటి జోలికి వెళ్లమని హైడ్రా తేల్చిచెప్పింది. ‘ఒప్పుకుంటే చె క్కు.. లేకపోతే హైడ్రాతో చెక్!’ శీర్షికతో శనివారం ‘మన తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి హైడ్రా స్పందించింది. కూకట్‌పల్లి పరిధిలోని గోపాల్‌నగర్ భూములపై ఆరా తీసింది. ఈ సందర్భంగా యూఎల్‌సీ భూముల్లోని పాత లేఔట్‌లలో రెగ్యులరైజ్ కాని ఖాళీ ప్లాట్ల పై ఎలాంటి చర్యలుండవని హైడ్రా స్ప ష్టం చేసింది. యూఎల్‌సీ భూముల్లో వెలిసిన లే ఔట్‌లో ఖాళీగా ఉన్న ప్లాట్లను హైడ్రా పేరు చెప్పి ఆక్రమించుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఎవరూ నమ్మవద్దని కోరింది.
ఈ విషయంలో ఎలాంటి సందేహాలున్నా హైడ్రా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించింది. హైడ్రా పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందితే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లే ఔట్ ప్రకారం రహదారులు, పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా హైడ్రా కాపాడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. కూకట్‌పల్లి గోపాల్‌నగర్ యూఎల్‌సీ భూముల్లోని లే ఔట్‌లలో రెగ్యులరైజ్ కాని ప్లాట్లను హైడ్రా తీసుకుని ప్రభుత్వానికి అప్పగిస్తుందని కొంతమంది కబ్జాదారులు చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, మీ ఇంటి స్థలాన్ని తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనే కుట్రకోణం ఉన్నదన్న విషయయాన్ని గ్రహించాలని హైడ్రా సూచించింది.