Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రెడిట్ స్కోరు దెబ్బ నుంచి ఓ ఉత్తరాఖండ్ వాసిని రక్షించింది. ఏండ్ల తరబడిగా ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వర్‌కు ప్రతికూల క్రెడిట్ స్కోరు వస్తోంది. అయితే తనకు ఎటువంటి అప్పులు లేవని, చెల్లింపుల బాదరబందీకి దూరంగా ఉన్నానని అయితే ఈ పేలవ క్రెడిట్ స్కోర్ తనను వేధిస్తోందని పన్వర్ వాపోతున్నాడు. తాను ఈ క్రెడిట్ స్కోర్ ఆటంకాలతో రుణాలు పొందలేకపోతున్నానని , పైగా తప్పు చేశాననే భాధలో ఉన్నానని , తనను రక్షించాలని కోరుకున్నాడు. దీనిపై న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది. 2020 నుంచి తన వెంటపడుతున్న ఈ బెడదపై రంగంలోకి దిగింది, ప్రధాన బ్యాంకులైన ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర బ్యాంకులను పన్వర్ బకాయిల గురించి వివరాలను ఆరా తీసింది. ఎటువంటి బకాయిలు లేవని వివరణ వచ్చింది. రుణాల విషయంలో క్లీన్‌చిట్ వచ్చింది. పన్వర్ రికార్డులను సవరించినట్లు, ఇక తాజా వివరణ ఆయనకు అందుతుందని సిబిల్ వర్గాలు తెలిపాయి.