
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద పరాజయాలు పలకరించినా.. గతేడాది వచ్చిన ‘క’ (KA) చిత్రంతో పీరియడ్ థ్రిల్లర్ జోనర్‌లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాతో తన మార్కెట్ స్టామినాని నిరూపించుకున్నారు. ఇప్పుడు కెరీర్ పరంగా ఒక సాహసోపేతమైన, షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు కిరణ్.
దర్శకుడిగా కొత్త ప్రయాణం
సాధారణంగా ఒక హీరోకి వరుస విజయాలు వస్తున్నప్పుడు రెమ్యునరేషన్ పెంచి వరుసగా సినిమాలు చేయాలనుకుంటారు. కిరణ్ అబ్బవరం విషయంలోనూ అదే జరిగింది. ‘క’ విజయం తర్వాత ఆయనకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఏకంగా రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చే ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే, కేవలం నటనకే పరిమితం కాకుండా, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ భారీ ఆఫర్లను పక్కనబెట్టి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు.
‘రియాలిటీ’ తో తొలి అడుగు..
కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా ఉండే ఒక వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. కిరణ్ అబ్బవరం సినిమాల్లోకి రాకముందు అనేక షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉండటంతో, దర్శకత్వం ఆయనకు కొత్తేమీ కాదు. ఈ చిత్రాన్ని మే 2026లో సెట్స్ పైకి తీసుకెళ్లి, శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కేవలం హీరో, దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగా కూడా కిరణ్ బిజీ అవుతున్నారు. తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న వైవిధ్యమైన చిత్రం తిమ్మరాజుపల్లె టీవీ . ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందుతున్న ఒక భారీ వెబ్ సిరీస్‌లో కిరణ్ నటిస్తున్నారు.
ALSO READ : భయపెడుతున్న ‘రాకాస’ వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎంత రాబట్టిందంటే?
సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం
నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఒకేసారి మూడు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సామాన్యమైన విషయం కాదు. టాలీవుడ్‌లో గతంలో దిగ్గజాలు చేసిన ఈ ఫీట్‌ను ఇప్పుడు కిరణ్ అబ్బవరం పునరావృతం చేయబోతున్నారు. కథాబలమున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే కిరణ్, మరి దర్శకుడిగా ‘రియాలిటీ’తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.