
లవ్‌ఫెయిల్యూర్ కథలు మనం తరచూగా వింటూనే ఉంటాం. చూస్తుంటాం కూడా. కానీ ఒక 15 ఏళ్ల బాలుడు తన ప్రియురాలి కోసం చేసిన పని పోలీసులను సైతం ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. తన ప్రియురాలిని సమయానికి స్కూల్లో చేర్చాలనే పట్టుదలతో, అతను ఏకంగా ఒక బస్సునే దొంగిలించాడు.. అంతటితో ఆగలేదు. ఆ బస్సును తానే నడుపుతూ ఏకంగా 130 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిపోయాడు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంంటే..ఆ బాలుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్‌లో కూడా ఎలాంటి శిక్షణ లేదని తెలిసింది. రద్దీగా ఉండే రోడ్లపై ఒక ప్రొఫెషనల్ డ్రైవర్‌లా బస్సును నడిపాడు. ఇప్పుడు, ఒక బాలుడు అంత పెద్ద బస్సును అంత సమర్థవంతంగా ఎలా నడపగలిగాడనే రహస్యాన్ని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ అసాధారణ సంఘటన మార్చి 27వ తేదీన జర్మనీలోని వీస్‌బాడెన్‌లో జరిగింది.
ప్రేమలో ఉన్నప్పుడు అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేస్తారని అంటారు. కానీ జర్మనీలో ఒక 15 ఏళ్ల బాలుడు చేసిన పని మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. తన గర్ల్ ఫ్రెండ్‌ను స్కూల్‌లో దించడానికి అతడు చేసిన సాహసం ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. జర్మనీలోని వీస్‌బాడెన్ నగరానికి చెందిన ఒక మైనర్ బాలుడు, తెల్లవారుజామున ఒక బస్సు డిపో నుండి ఖాళీ బస్సును దొంగిలించాడు. ఆ బాలుడికి బస్సు నడపడంలో ఎటువంటి అనుభవం లేదు, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ పొందే వయస్సు కూడా లేదు. అయినప్పటికీ, అతను బస్సును స్టార్ట్ చేసి తన ప్రేయసిని ఎక్కించుకుని హైవేపై ప్రయాణం మొదలుపెట్టాడు.
బస్సు కనిపించకపోవడంతో అప్రమత్తమైన రవాణా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బస్సుకు ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా గాలించగా, అది కార్ల్స్‌రూహె నగరం వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. దాదాపు 130 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత పోలీసులు బస్సును అడ్డుకోగలిగారు. బస్సును ఆపి చూడగా, డ్రైవర్ సీటులో 15 ఏళ్ల బాలుడు ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
పోలీసుల విచారణలో ఆ బాలుడు, తన ప్రేయసిని స్కూల్‌కు తీసుకెళ్లడానికే ఇలా చేశానని ఒప్పుకున్నాడు. అంత పెద్ద వాహనాన్ని, అంత దూరం ట్రాఫిక్‌లో నడిపినా ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రేమ కోసం ఏదైనా చేయాలనే ఉత్సాహం మంచిదే అయినా, ఇతరుల ప్రాణాలను, చట్టాన్ని పణంగా పెట్టడం సరైనది కాదని ఈ ఘటన నిరూపిస్తోంది. నెటిజన్లు ఈ వార్తను చూసి డ్రైవింగ్ రాకపోయినా 130 కిలోమీటర్లు ఎలా నడిపాడు? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.